ఇప్పుడంతా నిశ్శబ్దం అలుముకుంది
మాటలన్నీ మూగబోయిన గొంతులయ్యాయి
మౌనం మేఘాల్లా అలుముకుంది
రివ్వున వీచే గాలి సైతం గమ్మున ఉండిపోయింది
ఎగసి పడే సంద్రం కూడా కదలకుండా...
నిచ్ఛలంగా నిలబడి చూస్తుంది
భువిన నాటుకున్న విత్తులన్నీ
దేహం నుండి రాలిపడుతున్న..
స్వేదపు చుక్కల సాక్షిగా.. కర్షకుడు..
పండించిన ధాన్యపు రాసులన్నీ..
కల్లాల్లో కన్నీరును కారుస్తున్నాయి
ఏళ్ల తరబడిలేని కొత్త చట్టాలన్నీ..
ఇపుడు కొత్త చుట్టాలుగా మారి...
హాలికుడి కంఠాన హాలాహలాన్ని మిగులుస్తున్నాయి
రైతు నెత్తుటి కన్నీరుతో నేలంతా తడుస్తుంది
ఆశలన్నీ కన్నీటి అశ్రుధారలై పారుతున్నాయి
పాలకుల పాదాలను తాకి...
నిరసనను తెలియజేస్తున్నాయి
మూడు చట్టాల రద్దు ముచ్చట..
ముచ్చటగానే మిగిలిపోతుందా..?
సేద్యకాడి పంటకు గిట్టుబాటు హామీలు
తుర్రున ఎగిరే పక్షుల్లా అలా గాల్లో
ఎగిరిపోతున్నాయి.
వ్యవసాయదారుడి మోములో ఎపుడూ
నిశ్శబ్దపు ఛాయలే అలుముకుంటాయి
కాలమెంత పరీక్షపెట్టినా....కాయాన్ని నమ్ముకుని
పంటచేలలో పనిపురుగై పరుగులుతీస్తాడు
జన్మనిస్తున్న బిడ్డకు పురుడోస్తున్నట్లు...
ప్రతి మొక్కనూ ఎదలో దాచుకొని సాగుచేస్తాడు
ఉవ్వెత్తున ఎగుస్తున్న ఉద్యమానికి
ఊపిరై నిలబడదాం
రైతన్న దేహంపై పడుతున్న ఒక్కొక్క
లాఠీ దెబ్బకు పదింతల ఉద్యమ
పిడుగులై విరుచుకుపడుదాం
జై కిసాన్ జెండాను భరత భూమిపై ఎగరేద్దాం!
అశోక్ గోనె
94413 17361