ప్రజాశక్తి-విజయవాడ : జిల్లా వ్యాప్తంగా ఇంటింటి ఓటర్ల జాబితా పరిశీలన విజయవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ అన్నారు. స్ధానిక కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో బుధవారం ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా పరిశీలనపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జెసి మాట్లాడుతూ ఓటర్ల జాబితా పరిశీలనలో రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ దష్టికి తీసుకువచ్చిన సమస్యలను తప్పక పరిష్కరిస్తామన్నారు. నియోజకవర్గాల వారీగా బూత్ స్థాయి అధికారులు (బిఎల్వోలు ) డోర్ టు డోర్ పరిశీలన విజయవతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. జిల్లాలో 7 లక్షల కుటుంబాలు ఉన్నాయని, ప్రస్తుత జాబితా ఆధారంగా 16 లక్షల ఓటర్లు నమోదై ఉన్నారని తెలిపారు. సర్వే ప్రక్రియకు రాజకీయ పక్షాలవారు అధికారులకు సహకరించాలని కోరారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ ఈనెల 21వ తేదీతో సర్వే ప్రక్రియను ముగించకుండా మరి కొంత కాలం పెంచేలా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలని, బిఎల్‌వోలు, క్షేత్రస్థాయి డోర్ టు డోర్ వెరిఫికేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని మరి కొంత ముందుగా అందించాలని జెసిని కోరారు. ఈసమావేశంలో డిఆర్వో కె. మోహన్ కుమార్, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బిజెపి, వైసిపి, టిడిపి, బిఎస్‌పి ప్రతినిధులు బొర్రా కిరణ్, పి.ఏసుదాస్, డివి.కృష్ణ, ఎన్.వీరభద్రరావు, ఎ.రాజేష్, వై.ఆంజనేయరెడ్డి, ఎల్.శివరాం ప్రసాద్, ఎన్.రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.










