ప్రజాశక్తి-విజయనగరం : బూత్ స్థాయి అధికారులు తమ పరిధిలోని ఓటర్ల జాబితాలను నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. ఆదివారం కంటోన్మెంట్ ప్రాంతంలోని నగర పాలకసంస్థ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏడు పోలింగ్ కేంద్రాలు, రూరల్ మండలం దుప్పాడ ప్రాథమిక పాఠశాలలో నాలుగు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. సిబ్బంది నిర్దేశించిన వేళల్లో పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉంటున్నదీ, లేనిదీ తెలుసుకున్నారు. బిఎల్‌ఒలు తప్పనిసరిగా నిర్దేశిత వేళల్లో పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టాల్సి ఉందన్నారు. ఈ పర్యటనలో తహశీల్దార్ కోరాడ శ్రీనివాసరావు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వహించిన బిఎల్‌ఒలపై క్రమశిక్షణ చర్యలు
ప్రత్యేక సమ్మరీ రివిజను -2024కు సంబంధించిన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు పత్రికల్లో ప్రతికూల కథనాలు రావడంతో దత్తిరాజేరు మండలం బలభద్ర రాజపురం, డెంకాడ మండలం జొన్నాడ బిఎల్‌ఒలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వెల్లడించారు. ఈ విషయమై వీరిపై ఒక నివేదిక అందించాలని ఆదేశించామని తెలిపారు.