నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
ప్రజాశక్తి - మహానంది
మహానంది క్షేత్ర పరిధిలో నిషేధిత సిగరెట్, గుట్కా, పాన్ మసాలాలు స్వాధీనం చేసుకున్నట్లు మహానంది దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మహానంది క్షేత్ర పరిధిలో ఉన్న దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. నిషేధిత సిగరెట్, గుట్కా, పాన్ మసాలాలను పాలకమండలి సభ్యులు జి.మల్లికార్జున సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకోవడమే కాక జరిమానాలు విధించడంతోపాటు, వారి షాపులు కూడా రద్దు పరుస్తామన్నారు. ప్రస్తుతం మొదటిసారి హెచ్చరించి వదిలేశామని అన్నారు. మరోసారి ఇలాగే అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటివి క్రయవిక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరినట్లుగా తెలిపారు. శనివారం ఉదయం మహానంది దేవస్థానం కార్యాలయంలోని షాపులు, హౌటల్ యజమానులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. క్షేత్ర పరిధిలో భక్తులకు ఎంఆర్‌పి రేట్లకే తినుబండారాలు విక్రయించాలన్నారు. హోటళ్ల నిర్వాహకులు ఆరోగ్య భద్రత విభాగం నుండి తప్పనిసరిగా లైసెన్స్ పొంది ఉండాలన్నారు. పాలిథిన్ కవర్లు విక్రయించరాదన్నారు. క్షేత్రంలోని ఓ హౌటల్ వద్ద కళ్యాణ మండపాలు, వసతి గృహాలు, ప్రైవేటు వ్యక్తులు బుకింగ్ చేసుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందని, అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడుల్లో ఆలయ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, ఆఫీస్ సిబ్బంది, ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారు.










