Nov 02,2023 23:44

నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగంపై ఉక్కుపాదం

నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగంపై ఉక్కుపాదం
ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌
తిరుపతి నగరంలో నిషేధిత ప్లాస్టిక్‌ ఉత్పత్తుల విక్రయాలపై నగరపాలక సంస్థ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ యువ అన్వేష్‌ ఉక్కుపాదం మోపారు. తిరుపతి నగరంలో గురువారం ప్లాస్టిక్‌ విక్రయాలపై కార్పొరేషన్‌ ప్రజా ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ యువ అన్వేష్‌ దాడులు నిర్వహించారు. 85 కేజీల మేర సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌, క్యారీ బ్యాగులు, సీజ్‌ చేసి, సుమారు 72 వేల రూపాయలు అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన మేరకు 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ ఉత్పత్తులు విక్రయం, వినియోగించడం చట్ట విరుద్ధమన్నారు. నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లు, కప్పులు, ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, ఫోర్క్‌ లు, స్ట్రాలు, థర్మాకోల్‌ ప్లేట్ల్‌, కంటైనర్స్‌, అర్థలీటర్‌ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ళు, పాలిప్రోపలిన్‌ క్యారీ బ్యాగ్స్‌, వాటర్‌ ప్యాకెట్స్‌ వంటివి విక్రయిస్తూ పట్టుబడితే రూ.5 వేలు నుంచి రూ. 25 వేలు వరకు లభ్యతను బట్టి జరిమానా విధిస్తామన్నారు. అలాంటి దుకాణాలను సీజ్‌ చేస్తామని, మరొకసారి పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన వారి ట్రేడ్‌ లైసెన్సులు రద్దు చేస్తామని అన్నారు. ఈ దాడుల్లో శానిటరీ సూపర్‌ వైజర్లు చెంచయ్య , సుమతి పాల్గొన్నారు.