'నిషేధిత' జాబితా నుండి విముక్తి కల్పించండి
'జగనన్నకు చెబుదాం' లో 27 ఫిర్యాదులు
ప్రజాశక్తి - రామచంద్రాపురం
'గాలేరు - నగిరి' కాలువ నిర్మాణానికి ప్రభుత్వానికి కొంత భూమి ఇస్తే మిగిలిన మా పట్టా భూములను రెవెన్యూ అధికారులు నిషేధిత జాబితాలో (22ఎ) పెట్టారని, ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి' అని జిల్లా జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీకి ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమం రామచంద్రాపురం మండల కేంద్రంలో జరిగింది. జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు నివేదిక పంపాలని తహశీల్దార్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. అలానే ప్రభుత్వ భూములు, స్మశానాలు, వాగులు, కుంటలు కబ్జాలకు గురవుతున్నాయని పలు గ్రామాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. గ్రామకంఠంలో పేదలు నిర్మించుకున్న పక్కా గృహాలకు ప్రభుత్వం వన్‌టైం సెటిల్మెంట్ 'ఒటిఎస్' ద్వారా డబ్బులు పదివేలు కట్టించుకుని రిజిస్ట్రేషన్లు చేయించారని, కానీ ఆ ఒటిఎస్ రిజిస్ట్రేషన్ పత్రానికి రుణాలు ఇవ్వడం లేదని గణేశ్వపురం ఎఎడబ్ల్యుకు చెందిన కుమారి ఫిర్యాదు చేశారు. అయితే అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. కమ్మకండ్రిగ గ్రామానికి ఆనుకుని కోళ్లఫారాలు ఎక్కువగా ఉండటం వల్ల గ్రామంలో ఈగల బెడద భరించలేకపోతున్నామని గ్రామస్తులు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. పశు సంవర్ధక శాఖ, పంచాయతీరాజ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. నడవలూరు గ్రామంలో సచివాలయ భవన నిర్మాణానికి మొదటి అంతస్తు పూర్తి చేసినప్పటికీ ఇంజినీరింగ్ అధికారులు బిల్లులు మంజూరు చేయలేదని సర్పంచి గణపతిరెడ్డి ఫిర్యాదు చేశారు. బిల్లులు మంజూరు చేయాలని ఇంజినీరింగ్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజామస్తాన్‌ను ఆదేశించారు. మొత్తం 27 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 16, రోడ్లు భవనాల శాఖకు 3, పౌరసరఫరాల శాఖకు రెండు, గ్రామీణ అభివృద్ధి శాఖకు రెండు, పంచాయతీరాజ్ శాఖకు ఒకటి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు మూడు ఫిర్యాదులు అందాయని ఎంపిడిఒ శ్రీనివాసులు తెలిపారు. జేసీ డికె బాలాజీ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులు విచారించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పథక సంచాలకురాలు ఏడి జ్యోతి, సుశీల దేవి, రాధమ్మ. డిపిఓ ఆదెంరాజశేఖర్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి చంగల్ రెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాసులు, తహశీల్దార్ జీసీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
జగనన్నకు చెబుదాంలో వినతిపత్రాలు స్వీకరిస్తూ...










