May 13,2023 00:40

కార్యక్రమంలో గుంటూరు కలెక్టరేట్‌ నుండి వర్చువల్‌గా హాజరైన కలెక్టర్‌, జెసి

ప్రజాశక్తి-గుంటూరు, నరసరావుపేట : చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం కోసం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల జిల్లాలో 601.36 ఎకరాలను 22-ఏ నిషేధిత జాబితా నుండి తొలగించి జిల్లాలోని రైతులకు లబ్ది చేకూర్చినట్లు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరు జిల్లా కావలి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చుక్కల భూములకు సంపూర్ణ హక్కును కల్పించే కార్యక్రమం ప్రత్యేక్ష ప్రసారాన్ని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జెసి జి.రాజకుమారి, డీఆర్‌ఓ కె.చంద్రశేఖరరావుతో కలసి వీక్షించారు. కార్యక్రమంలో కలక్టరేట్‌ పరిపాలన అధికారి పూర్ణ చంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ఎస్‌.ఆర్‌. శంకరన్‌ వీడియో కాన్ఫరెన్సు హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, జెసి ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ వర్చువల్‌గా హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 10,885 సర్వే నంబర్ల ద్వారా నమోదైన 48,147 ఎకరాలకు యజమానులను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు. నిషేధిత 22-ఎ చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం 9253 కుటుంబాలకు లబ్ది కలిగిందని జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు. అత్యధికంగా పల్నాడు జిల్లాలో నరసరావుపేట రెవెన్యూ డివిజన్‌ నుంచి 18,799 ఎకరాల చుక్కల భూములకు యాజమాన్య హక్కు పత్రాలు వచ్చాయని తెలిపారు. చుక్కుల భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్‌, క్రయ, విక్రయాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు. వీటిపై ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తమ దృష్టికి వెంటనే తీసుకు రావాలన్నారు. ఈ సందర్భంగా పలువురికి పట్టాలను అందించారు. కార్యక్రమంలో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులు, విఆర్‌ఒలు పాల్గొన్నారు.