Aug 18,2023 21:02

కరపత్రాలను విడుదల చేస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-హిందూపురం : విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్లు, కాంట్రాక్ట్‌ కార్మికులంతా ఒకే వేదిక పైకి వచ్చి న్యాయమైన వేతన ఒప్పందాన్ని సాధించటానికి అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని దీనికి సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తుందని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప అన్నారు. శుక్రవారం స్థానిక ట్రాన్స్‌కో డీఈ కార్యాలయం ముందు విద్యుత్‌ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులకు అన్యాయం చేసిన యజమాన్యం, పవర్‌ జేఏసీ వేతన ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కరపత్రాలను విడుదల చేసి కార్యాలయంలో ఉద్యోగులకు పంపిణీ చేశారు. ఈ నెల 9న రాష్ట్ర మంత్రులు, ఉన్నత అధికారులతో పవర్‌ జేఏసీ నాయకత్వం చేసిన విద్యుత్‌ వేతన ఒప్పందాన్ని ఏపీ విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్‌ ట్రగుల్స్‌ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్లు కాంట్రాక్ట్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని గత 17 నెలల నుండి ఆందోళనల కార్యక్రమాలు చేపట్టారన్నారు. పవర్‌ జాక్‌ చర్చలను సాగదీసి ఏ ఒక్క డిమాండ్‌ పరిష్కరించ లేదని విమర్శించారు. దీంతో ఉద్యోగులు అందరు కలిసి స్ట్రగుల్స్‌ కమిటీ ఏర్పడి పోరాటానికి సిద్ధపడ్డారన్నారు. ఆగస్టు 10 వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు పోరాట కమిటీ పిలుపునిచ్చిందన్నారు. అయితే ఆగస్టు 9 న పవర్‌ జేఏసీ అర్ధాంతరంగా ఉద్యమాన్ని విరమించిందని అన్నారు. దీనికంటే ముందు ఆగస్టు 8 చలో విద్యుత్‌ సౌధాన్‌కు పోలీసుల అనుమతి లేదని ఉపసంహరించుకుంది. వర్క్‌ టూ రూల్‌ పిలుపునిచ్చి ఏ మాత్రం ఆ కార్యక్రమాన్ని అమలు చేయకుండా కార్మికులను మోసం చేసిందన్నారు. విద్యుత్‌ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం స్ట్రగుల్‌ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే అన్ని ఆందోళన కార్యక్రమాలతో పాటు నిరవదిక సమ్మె చేపడితే అన్ని కార్యక్రమాలకు సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు మల్లికార్జున, కల్లూరు ఆటో వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు రఫీ, శ్రీరామప్ప, చంద్రశేఖర్‌, కష్ణమూర్తి, శీను తదితరులు పాల్గొన్నారు.