వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 8 నుంచి జరిగే నిరవధిక సమ్మె తలపెట్టారు. ఈ మేరకు సోమవారం ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యాన అంగన్‌వాడీలు జిల్లాలోని పలుచోట్ల ధర్నాలు, నిరసనలు తెలుపుతూ, సిడిపిఒలకు సమ్మె నోటీసులుఅందజేశారు.
పజాశక్తి - పార్వతీపురంరూరల్ : అంగన్వాడీల వేతనాల పెంపు, గ్రాట్యూటి, పెన్షన్ అమలు, ఇతర సమస్యలు పరిష్కారం కోరుతూ డిశంబర్ 8 నుండి తలపెట్టిన నిరవధిక సమ్మె నోటీసును అంగన్వాడీ యూనియన్ నాయకులు సిడిపిఒ విజరు గౌరికి అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి గంట జ్యోతి, గౌరవ అధ్యక్షులు ఎం. ఉమామహేశ్వరి మాట్లాడుతూ గర్భిణులకు, బాలింతలకు, సున్నా నుండి ఆరేళ్లలోపు పిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు అనేక సేవలు అందిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిరంతరము నిత్యవసర సరుకుల ధరలు, డీజిల్, పెట్రోలు, గ్యాస్, ధరలు పెరుగుతున్నా వేతనాలు మాత్రం పెరగలేదన్నారు. ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాలతో జీవనం భారంగా ఉందన్నారు. దీనికితోడు కేంద్రాల నిర్వహణకు సంబంధించిన బిల్లులు సకాలంలో చెల్లించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి హామీ నేటికీ నెరవేరలేదన్నారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, కానీ మన రాష్ట్రంలో అమలు చేయడం లేదని అన్నారు. 48ఏళ్ల నుంచి పనిచేస్తున్న అంగన్వాడీలకు కనీసం సర్వీసులో ఉండి చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదని, ప్రభుత్వం అందరికీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా అంగన్వాడీలకు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ సెంటర్లు నిర్వహణకు వివిధ రకాల యాప్స్ తెచ్చారు. ఫోన్లు పనిచేయడం లేదని, ఏ ట్రైనింగ్ ఇవ్వలేదని, ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో నెట్టు సిగల్ ఉండడం లేదని, దీనివల్ల అంగన్వాడీలు మానసిక వత్తిడికి గురవుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో దశలవారీగా అనేక ఆందోళనలు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 8 నుండి కేంద్రాలను మూసివేసి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు తెలిపారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సెక్టార్ నాయకులు రాజేశ్వరి, గౌరీ, మణి, సాయి, లత, జ్యోతి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
సాలూరు:తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జ్యోతి ఆధ్వర్యాన ప్రాజెక్టు పరిధిలోని కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్ 8నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు వారు సిడిపిఓ బి.సత్యవతికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు నాయకులు బి.రాధ, సెక్టార్ నాయకులు శ్యామల, రమణమ్మ, విజయ, తిరుపతమ్మ, శశికళ పాల్గొన్నారు.
పాలకొండ: స్థానిక ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్.హిమప్రభ, జిల్లా కోశాధికారి బి.అమరవేణి, పాలకొండ ప్రాజెక్ట్ అధ్యక్షులు జి.జెస్సిబారు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు జి.శారద, కె.శారద, ఎం.శ్యామల, మణికుమారి, రోజా, భవానీ, నిర్మల, పెద్దఎత్తున అంగన్‌వాడీలు పాల్గొన్నారు.
బలిజిపేట : అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ డిసెంబర్ 8 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సీనియర్ అసిస్టెంట్‌కు సమ్మె నోటీసును అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యం అందజేశారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ ప్రాజెక్టు నాయకులు కె.దాలమ్మ, సత్యవతి మాట్లాడారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు, ఆయాలు, సెక్టార్ నాయకులు పాల్గొన్నారు. లీడర్లు పాల్గొన్నారు.
పాచిపెంట : స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారులకు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షులు టి.ప్రభావతి ఆధ్వర్యంలో సమ్మె నోటీసును అధికారులకు అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 8నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నామని తెలిపారు. వినతిని అందజేసిన వారిలో ప్రాజెక్ట్ నాయకులు పైడ్రాజు, సత్యవతి, బేగం, సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు ఉన్నారు.
కొమరాడ : డిసెంబర్ 8నుంచి జరగనున్న నిరవధిక సమ్మె ముందస్తు నోటీసును ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద సిడిపిఒ జి.సుగుణకు అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి సిరికి అనురాధ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకూ నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి, గంగ రేగివలస, విక్రాంపురం ప్రాజెక్టుల నాయకులు బి.అలివేలు, జ్యోతి పెద్ద ఎత్తున ఆయా, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీతంపేట: డిసెంబర్ 8 నుంచి సమ్మె చేస్తున్నట్లు నోటీసును సిడిపిఒ పి.రంగలక్ష్మికి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు పార్వతి, దర్శిమీ అందజేశారు. కార్యక్రమంలో పలువురు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.