Aug 11,2023 22:05

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

* 2013 చట్టం ఎందుకు అమలు చేయలేకపోయారు
* రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, అర్బన్‌: 
వంశధార నిర్వాసితులను మోసం చేసింది చంద్రబాబేనని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని వైసిపి జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వంశధార నిర్వాసితుల యూత్‌ ప్యాకేజీ కోసం 2016 జూలైలో చంద్రబాబు ప్రభుత్వం జిఒ విడుదల చేసిందని, భూసేకరణ చట్టం అమల్లో ఉన్నా, ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. వంశధార నిర్వాసితులను చంద్రబాబు ఏవిధంగా మోసం చేశారో జిల్లా ప్రజలకు తెలుసునన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రూ.216 కోట్లను మంజూరు చేశారని చెప్పారు. నిర్మాణం జరుగుతున్న ఒక ప్రాజెక్టులో భూసేకరణ చట్టం అమలు చేస్తే అన్ని ప్రాంతాల నిర్వాసితుల నుంచి అదే రకమైన డిమాండ్లు వస్తాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిర్వాసితులకు ఎక్స్‌గ్రేషియో రూపంలో పరిహారం అందించిందని స్పష్టం చేశారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వంశధార ప్రాజెక్టులో 94 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. నేరడి బ్యారేజీకి అడ్డంకులు ఉన్నందునే ఒకవైపు సైడ్‌వియర్‌ కాలువ నిర్మాణంతో పాటు మరోవైపు హిరమండలం వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వీటి ద్వారా ఎన్ని టిఎంసిలు నీళ్లు వస్తాయో, ఎన్ని ఎకరాల స్థిరీకరణ జరుగుతుందో చంద్రబాబుకు అవగాహన లేనట్లు ఉందని చెప్పారు. వంశధార, నాగావళి అనుసంధాన పనులు 80 శాతం మేర అయ్యాయని, మరో నాలుగైదు నెలల్లో పూర్తవుతాయని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వైఎస్‌ హయాంలోనే సుజల స్రవంతి ప్రతిపాదన జరిగిందని చెప్పారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.17వేల కోట్లతో మొదటి ప్యాకేజి పనులకు అనుమతులిచ్చామని, ఎల్‌ఎ, సర్వే, టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. రెండో ప్యాకేజీలో డిజైన్‌, ఎల్‌ఎ పూర్తయిందని, త్వరలో టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టనున్నామని చెప్పారు. సోలార్‌, విండ్‌, హైడల్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి యూనిట్‌ కరెంట్‌ను రూ.3లకే ఇస్తామని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. టిడిపి హయాంలో సోలార్‌ పవర్‌ను యూనిట్‌కు రూ.5.80 కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని, ఒప్పందాన్ని రద్దు చేస్తే కోర్టుకు వెళ్లారని చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పెద్ద వ్యాపారి అని పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పార్టీని చంద్రబాబుకు అమ్మేసి, కార్యకర్తల నమ్మకాన్ని తాకట్టు పెట్టింది పవన్‌ కళ్యాణే అని విమర్శించారు. చంద్రబాబు ఏది చెప్తే పవన్‌ చేస్తున్నారని, కట్టుబానిసగా మారారని చెప్పారు. మూడు రోజులుగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే విశాఖ రాజధానిని వెనక్కి నెట్టేసే కుట్ర కనిపిస్తోందని ఆరోపించారు. సమావేశంలో నాయకులు అంధవరపు సూరిబాబు, శిమ్మ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు
ప్రజలను మభ్యపెట్టే మాటలు : కృష్ణదాస్‌
వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు మళ్లీ మాటల గారడీతో ప్రజల్ని మభ్యపెట్టే వ్యూహంతో వచ్చారని వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. శ్రీకాకుళం నగరంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు జరిగే ముందు ప్రతిసారీ ఇలాగే ప్రజలను వంచించడం చంద్రబాబుకు అలవాటు అని వ్యాఖ్యానించారు. జిల్లా రైతాంగంపై మాటల్లోనే అంత ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు వంశధారను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులు ప్రారంభించింది ఎవరో చంద్రబాబు మరచిపోయారన్నారు. రూ.వేల కోట్లతో జిల్లాలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.