Nov 11,2022 22:10

గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ
ప్రజాశక్తి - కుక్కునూరు

           పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులను గోదావరిలో ముంచి జలసమాధి చేస్తారా.. నిర్వాసితులపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దారుణం అంటూ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారానికి ఐదో రోజుకు చేరాయి. నిర్వాసితులు చేస్తున్న రిలే దీక్షలకు రామకృష్ణ, నాయకులు కారం భాస్కర్‌ సందర్శించి దీక్షలకు మద్దతు ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలనుద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వాలు, అధికారులు సమీక్షలు పెడుతున్నారే తప్ప దాని కోసం త్యాగం చేస్తున్న నిర్వాసితుల పరిహారం చెల్లింపుపై ఎవరూ మాట్లాడటం లేదని, ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకముందే బ్యాక్‌ వాటర్‌ ప్రభావం వల్ల ఇప్పటికే గ్రామాలు మునిగాయని, ప్రభుత్వం మాత్రం పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టును పూర్తిచేసి గ్రామాల్లోని నిర్వాసితులను జలసమాధి చేసేందుకే చూస్తుందని విమర్శించారు.
నిర్వాసితుల సమస్యలు చెప్పుకోవడానికి 120 కిలోమీటర్లమేర కెఆర్‌.పురం ఐటిడిఎ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుందని, నెలకో ఐటిడిఎ పిఒని బదిలీ చేస్తూ ఉంటే నిర్వాసితుల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయన్నారు. కుక్కునూరులోనే సమస్యల పరిష్కారానికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని, ఎల్లప్పగూడెం, కౌండిన్యముక్తి, మాధవరం, బెస్తగూడెం గ్రామాలను మొదటి కాంటూర్‌లో చేర్చాలని, గోదావరి వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలో నిర్వాసితుల సంఘం నాయకులు వై.నాగేందర్రావు, పట్ల లక్ష్మయ్య, వై.సాయికిరణ్‌, ఎస్‌.లక్ష్మణరావు, ఎస్‌.సిరామమ్మ, తిరుపతమ్మ, రాములమ్మ, పద్మ, రాజమ్మ, ఎస్‌.నాగరాజు, బాలరాజు పాల్గొన్నారు.