ప్రజాశక్తి-విఆర్.పురం
ఆర్ అండ్ ఆర్ ఇళ్ల పట్టాల పేరుతో మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజన నిర్వాసితుల లబ్ధిదారులను మాటిమాటికి మండల కేంద్రానికి పిలుస్తూ ఇబ్బందులకు గురి చేయడం తగదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని రేఖపల్లి సిపిఎం కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొల్లూరు, గొందూరు, తుమ్మలేరు, కొండెపూడి గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే పడవలో ప్రయాణం చేయాల్సి వస్తుందని తెలిపారు. కొల్లూరు నుంచి రేఖపల్లి కేంద్రానికి రావడానికి ఒక మనిషికి రూ.400 ఖర్చు అవుతుందని, దీనిని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తున్న వారిని ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. ఆ గ్రామాలకు వెళ్లి అక్కడ పట్టాలు ఇవ్వాలి తప్ప మండల కేంద్రానికి పిలుపించుకొని ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని హితవుపలికారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్వాసితుల ఇళ్ల పట్టాలను ఆయా గ్రామాల్లో విఆర్‌ఒ, వాలంటీర్లు ద్వారా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ కాలం లక్ష్మీ, సర్పంచ్‌లు కారం బుచ్చమ్మ, పులి సంతోష్ కుమార్, సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, నాయకులు పంకు సత్తిబాబు, కుంజ నాగిరెడ్డి, వడ్లాది రమేష్ పాల్గొన్నారు.










