Nov 30,2022 23:40

స్టీల్‌ సిఐటియు మహాసభలో యూనియన్‌ నేతలు

సిఐటియు ఐదో మహాసభలో తీర్మానం
ప్రజాశక్తి-ఉక్కునగరం
: స్టీల్‌ ప్లాంట్‌ నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలని స్టీల్‌ సిఐటియు ఐదో మహాసభ తీర్మానించింది. బుధవారం అగనంపూడి కమ్యూనిటీ వెల్ఫేర్‌ సెంటర్‌లో నిర్వహించిన మహాసభలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వైటి.దాసు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులకు వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.గత అక్టోబర్‌లో ఎన్‌ఎసిఎస్‌ సమావేశంలో క్లాజ్‌- 8 కారణంగా నూతన వేతనాలు అమలు కాకుండా అప్పట్లో అడ్డుపడిన ప్రస్తుత గుర్తింపు యూనియన్‌ ఇప్పటికైనా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి వేతన ఒప్పందం చేయాలన్నారు.
ఆర్గనైజింగ్‌ సెక్రటరీ యు.రామస్వామి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కు తీసుకోవాలని, లేకుంటే అన్ని పక్షాలతో కలిసి పోరాటం ఉధృతం చేయాలని మహాసభలో పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం అవసరమైతే 25మంది ఎంపీలు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.నీలకంఠం మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరిస్తే, ఇప్పటికై అన్యాయమైపోయిన నిర్వాసితులకు ఎప్పటికీ న్యాయం జరగదన్నారు.యు మరిడయ్య అధ్యక్షతన జరిగిన మహాసభలో సెక్రటరీ సిహెచ్‌.అబ్బాయి, ఎర్రయ్య, అట్ట రామకృష్ణ, శశి రెడ్డి, పట్టా రమేష్‌, అప్పలరాజు, కోటి పాల్గొన్నారు. 40 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు.