Apr 29,2023 00:36

సర్వే వివరాలు తెలుసుకుంటున్న ఎంపిపి కారం లక్ష్మి, సిపిఎం నాయకులు

ఎంపిపి కారం లక్ష్మి
పునరావాస ఇళ్ల సర్వే పరిశీలన
ప్రజాశక్తి-విఆర్‌.పురం

పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని ఎంపిపి కాలం లక్ష్మి డిమాండ్‌ చేశారు. మండలంలోని ఒడ్డుగూడెం పంచాయతీ పరిధి ఒడ్డుగూడెం కాలనీ, ధర్మతాలగూడెం, గొల్లగూడెం గ్రామాల్లో అధికారులు నిర్వహిస్తున్న పునరావాస ఇళ్ల సర్వేను శుక్రవారం ఎంపిపి, సిపిఎం నాయకులు పరిశీలించారు. సర్వే చేసే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకొని, ఆ విధానం సరిగా లేదని తప్పు పట్టారు. ఈ సందర్భంగా ఎంపిపి లక్ష్మి మాట్లాడుతూ సర్వే చేసేటప్పుడు ఇంటి పొడవు, వెడల్పులు మాత్రమే చూస్తున్నారని, ఆ ఇంటి గోడలు సిమెంట్‌తో కట్టినవా, మట్టితో కట్టినవా అనేది పరిశీలించడం లేదని పేర్కొన్నారు. ఇంటి చుట్టూ నిర్మించిన ప్రహరీలను, ఇంటి ఆరుబయట చేసిన సిమెంట్‌ వాకిలిని చూడటం లేదన్నారు. ఒకవేళ ఇంటి యజమానులు అభ్యంతరం పెట్టినా పట్టించుకునే ఓపిక కూడా సర్వే చేసే అధికారులకు లేదని విమర్శించారు. సర్వే చేసేటప్పుడు గోడల నాణ్యతను కూడా చూడాలన్నారు. సంవత్సరంలో మూడు నాలుగు సార్లు వచ్చిన వరదలకు పూర్తిగా కొట్టుకుపోయిన ఇళ్లను కూడా సర్వే చేసి నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తాము నష్టపోయినా పర్వాలేదని భావించి పోలవరం ప్రాజెక్టు కోసం ఎన్నో తరాలుగా ఉంటున్న గ్రామలను త్యాగం చేస్తున్న గిరిజనులకు ఎటువంటి అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, నాయకులు పంకు సత్తిబాబు, గుండెపుడి లక్ష్మణరావు, పోడియం శ్రీరామ్మూర్తి, సోడి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.