ప్రజాశక్తి-సాలూరు : విఆర్‌ఎస్ ప్రాజెక్టు నిర్వాసితులు సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగునాయుడు, సహాయ కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మండలంలోని అన్నంరాజువలస పంచాయతీ పందిరి మామిడి వలస, కుద్దాడవలస గ్రామాల గిరిజనులు సాగు చేస్తున్న భూములను బుధవారం వారు పరిశీలించారు. ముచ్చర్లవలస సర్వే నంబర్లు 56 నుంచి 107 వరకు 180 ఎకరాల భూమిని వందమంది గిరిజనులు గత 40 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారని చెప్పారు. 40 ఏళ్ల క్రితం అప్పటి ఐటిడిఎ పిఒ ఎల్‌వి సుబ్రహ్మణ్యం కుద్దాడవలస, పందిరి మామిడి వలస గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అప్పటి నుంచి గిరిజనులు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదన్నారు. 2007లో సర్వే నెంబర్ 104, 105లో 13 ఎకరాల భూమిని అటవీశాఖకు రెవెన్యూ అధికారులు ఇచ్చారని చెప్పారు. ఆ భూముల సాగులో ఉన్న గిరిజనులు ఖాళీ చేయాలని అటవీ శాఖ అధికారులు బెదిరిస్తున్నారని, గిరిజనులపై దౌర్జన్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కుద్దాడవలస, పందిరి మామిడి వలస గిరిజనులు సాగు చేస్తున్న భూములకు వెంటనే పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు గూడెపు పులిరాజు, గవరయ్య, వల్లయ్య పాల్గొన్నారు.










