Apr 30,2023 00:30

అడవి వెంకన్న గూడెంలో సర్వేను పరిశీలిస్తున్న ఎంపిపి కారం లక్ష్మి, సిపిఎం నాయకులు

- ఎంపిపి కారం లక్ష్మి
ప్రజాశక్తి-విఆర్‌.పురం

పోలవరం కోసం తమ సర్వం కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం జరిగేలా సర్వే చేయాలని ఎంపిపి కారం లక్ష్మి అధికారులకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని రామవరం పంచాయతీ పరిధి అడవి వెంకన్నగూడెం, రామవరం గ్రామాలలో జరుగుతున్న పునరవాస ఇళ్ల సర్వేను శనివారం ఎంపిపి లక్ష్మి, సిపిఎం నాయకులు పరిశీలించారు. సర్వే చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ కొన్ని గ్రామాలలో సర్వే చేసే విధానం అసలు బాగాలేదని, ఈ విషయాన్ని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లినా సర్వే తీరు మారలేదని పేర్కొన్నారు. ఓపికతో ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుని నిర్వాసితుడికి పూర్తి న్యాయం చేయాలని సూచించారు. ఎన్నో సంవత్సరాలుగా జీవిస్తున్న తమ సొంత గ్రామాన్ని, వ్యవసాయాన్ని, అన్నింటిని రాష్ట్రం కోసం వదులుకొని వెళ్తున్న విషయాన్ని అధికారులు గమనించాలని, నిర్వాసితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండకూడదని కోరారు. ఇంటి కొలతలు తీసేటప్పుడు పొడవు వెడల్పులు మాత్రమే చూస్తున్నారని, ఇంటి చుట్టూ నిర్మించిన ప్రహరీ, ఆరుబయట చేసిన సిమెంట్‌ వాకిలిని, ఇంటి గోడల నాణ్యతను పరిగణనలోకి తీసుకొని సర్వే చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఏడాదికి మూడునాలుగు సార్లు వచ్చిన వరదలకు పూర్తిగా కొట్టుకుపోయిన ఇళ్లకు కూడా సర్వే చేసి వారికి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, నాయకులు కుంజ నాగిరెడ్డి, సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.