Feb 20,2023 22:07

ప్రజాశక్తి - వేలేరుపాడు
            పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎంపిపి వి.లక్ష్మీదేవి పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రవీణ్‌ఆదిత్యను కోరారు. ఆమె రాజమండ్రిలో సోమవారం ఆయనను కలిసి వినతిపత్రం అందించి నిర్వాసితుల సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారని, అయితే ఆ సభల్లో గత సర్వేల్లో మాదిరిగా ఇంటి విలువలు లేవని, ఫలితంగా నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ముంపు గ్రామాల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రకటిస్తున్న ఇంటి విలువలు గతం కంటే పూర్తి భిన్నంగా ఉన్నాయని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇంటి విలువ లెక్కగట్టాలని, అన్ని అర్హతలు కలిగిన యువతకు ప్యాకేజీ వర్తింపచేయాలని, గోదావరి వరదల వల్ల నష్టపోయిన వారికి వెంటనే పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు బద్దె ప్రేమ్‌ కుమార్‌, గిళ్ల వెంకటేశ్వర్లు, పెరుమాళ్ల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.