Aug 13,2023 00:07

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి కిరణ్‌

- సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి కిరణ్‌
ప్రజాశక్తి-కూనవరం

వరదల వల్ల నష్టపోయిన నిర్వాసితులను కలిసేందుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌, పునరావాస ప్యాకేజీ ఇచ్చి తరలిస్తారని భావిస్తే తీవ్ర నిరాశే మిగిల్చారని సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ అన్నారు. మండలంలోని పెదర్కూర్‌లో వైస్‌ ఎంపీపీ కొమరం పెంటయ్య ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు చుస్తే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తమబలం తగ్గుతుందనే భయంతో వచ్చారే తప్ప నిర్వాసితులకు న్యాయం చేయడానికి రాలేదని స్పష్టమవుతుందని పేర్కొన్నారు. ప్రతి నిర్వాసితుడు తమ బాధలు చెప్పుకుందామనుకుంటే, ఎంపిక చేసిన వారినే సభకు అనుమతి ఇచ్చారన్నారు. గతేడాది వచ్చిన వరదలలో నెలలు తరబడి కష్టాలు పడ్డారని, అయినా నాడు ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు సీఎం జగన్మోహన్‌రెడ్డిని చూసేసరికి అధికార పార్టీ నాయకులు సమస్యలు మర్చిపోయారా? అని ఏద్దేవా చేశారు.
పునరావాస గ్రామాలను కేంద్రం ఆమోదం చేయలేదని ముఖ్యమంత్రి వేదికపై చెప్పారని, లిడార్‌ సర్వే పేరుతో మోసం చేశారని, గతేడాది వచ్చిన వరదలకు ఎన్ని గ్రామాలు మునిగి నష్టపోయాయో తెలియదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది మునిగిన ప్రతి గ్రామానికి ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. త్వరలో ప్యాకేజీ ఇస్తామని చెప్పి మళ్ళీ మోసం చేశారని, త్వరలో ఎన్నికలు వస్తుంటే ఎలాగా ఇస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రాకకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, అయినా నిర్వాసితులకు ఉపయోగం లేకుండా పోయిందని పేర్కొన్నారు. నిర్వాసితుల సమస్యలపై నిరంతరంగా పోరాడుతున్న సిపిఎం ఢిల్లీలో సైతం నిర్వాసితుల గళం విప్పిందని తెలిపారు. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా నిర్వాసితుల సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు, ఆవుల మురళి, పాయం సత్యనారాయణ, సర్పంచ్‌ బొగ్గా రామారావు, కుంజా రాధ, తాళ్లూరి శ్రీనివాసరావు, కర్నాటి శ్రీనివాసరావు, పాయం జ్యోతి, బొగ్గా సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.