Aug 29,2023 22:31

మోసకారి హామీలతో నిండా ముంచిన జగన్‌
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం
యువగళం పాదయాత్రలో లోకేష్‌
పోలవరం నియోజకవర్గంలో కొనసాగిన యాత్ర
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి/ టి.నరసాపురం/ చింతలపూడి

టిడిపి అధికారంలొకొచ్చాక పోలవరం నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజి ఇచ్చే వెసులుబాటు ఉంటే కచ్ఛితంగా అందిస్తామని, గతంలో ఇచ్చిన ప్యాకేజీ హామీకి మాత్రం కట్టుబడి ఉన్నామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తెలిపారు. 198వ రోజు యువగళం పాదయాత్ర మంగళవారం చింతలపూడి మండలం తీగలవంచలో ప్రారంభమై పోలవరం నియోజకవర్గంలో ప్రవేశించింది. పోలవరం నియోజకవర్గం ముత్యాలమ్మపేటలో ప్రవేశించిన లోకేష్‌ పాదయాత్రకు నాయకులు, కార్యర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. దారిపొడవునా జనం పెద్దఎత్తున తరలొచ్చారు. జనంతో మమేకమవుతూ లోకేష్‌ ముందుకు సాగారు. తీగలవంచ, టి.నరసాపురం, ఏపుగుంట, తిరుమలదేవిపేట, వెంకటాపురం గ్రామాలకు చెందిన ప్రజలు లోకేష్‌ను కలిసి తమ గ్రామాల్లోని సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ప్రజలు అందించిన వినతుల్లోని సమస్యల పరిష్కారానికి అధికారంలోకి వచ్చిన వెంటనే కృషి చేస్తామని లోకేష్‌ వారికి హామీ ఇచ్చారు. మధ్యాహ్నర భోజన విరామ సమయంలో శ్రీరామవరంలో పోలవరం నిర్వాసితులతో నిర్వహించిన ముఖాముఖిలో లోకేష్‌ మాట్లాడారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పోలవరం నిర్వాసితులు మాట్లాడుతూ జగన్‌ రూ.పది లక్షల ప్యాకేజీ ఇస్తామని చెప్పి మోసగించారన్నారు. నిర్వాసితులను ముంచి ఆయన హ్యాపీగా పడుకున్నాడని, వరదలు వచ్చినప్పుడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని వాపోయారు. నిర్వాసితులు బతకడానికి ఇతర ప్రాంతాలకు వెళితే స్థానికులు కాదంటున్నారన్నారు. రీసర్వే పేరుతో తామంతా తీవ్రంగా నష్టపోతున్నామని, 2017లో ఒకసారి సర్వే అయినా మరోసారి సర్వే అంటూ జగన్‌ ప్రభుత్వం వేధిస్తుందని తెలిపారు. ఊర్లు ఖాళీ చేయించి ప్రభుత్వం మాకు ఎటువంటి సాయమూ అందించలేదని తెలిపారు. 2017 కట్‌ ఆఫ్‌ డేట్‌ పెట్టి 18 ఏళ్లు ఉన్నవారికి ప్యాకేజీకి అర్హులుగా టిడిపి ప్రభుత్వం ప్రకటించగా జగన్‌ వచ్చిన తరువాత ప్యాకేజీ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. వైఎస్‌ హయాంలో భూములిచ్చిన వారికి అదనంగా రూ.ఐదు లక్షలు ఇస్తానని జగన్‌ మోసగించారని తెలిపారు.
పోలవరం కట్టేది.. నిర్వాసితులకు న్యాయం చేసేది టిడిపినే
నిర్వాసితులతో లోకేష్‌ మాట్లాడుతూ పోలవరం పూర్తి చేసేది, నిర్వాసితులకు న్యాయం చేసేది టిడిపి ప్రభుత్వమేనని అన్నారు. చంద్రబాబు హయాంలో 72 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయన్నారు. రూ.లక్షా 15 వేల ప్యాకేజీని రూ.6.36 లక్షలకు పెంచింది చంద్రబాబేనన్నారు. రూ.నాలుగు వేల కోట్లు నిర్వాసితులకు ప్యాకేజీ, పునరావాసం కోసం ఖర్చు చేసింది టిడిపినే అన్నారు. పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారన్నారు. రూ.పది లక్షలు ప్యాకేజీ అని, గతంలో సేకరించిన భూములకు అదనంగా రూ.ఐదు లక్షలు ఇస్తానని చెప్పి, ఇప్పుడు తన చేతుల్లో ఏమీ లేదు.. కేంద్రం బటన్‌ నొక్కితేనే నిర్వాసితులకు డబ్బులు అని జగన్‌ అంటున్నాడని విమర్శించారు. జగన్‌ ఒక్క ఇల్లూ కట్టలేదు.. ఒక్కరికీ పూర్తిగా ప్యాకేజీ అమలు చేయలేదని అన్నారు. జగన్‌ ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే 25 సీట్లు వస్తాయని, మరో ఆరు నెలలు పోతే సింగిల్‌ డిజిట్‌నే అని, అందుకే జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నాడని సమాచారం ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిడిపి సిద్ధంగా ఉందని తెలిపారు. దొంగ కాగితాలు సృష్టించి నిర్వాసితులకు రావాల్సిన వందల కోట్లు వైసిపి నేతలు కొట్టేశారన్నారు. 2017లో జరిగిన సర్వేకు టిడిపి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దాని ఆధారంగానే ప్యాకేజీ అందిస్తామని తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో యువతకు ఉద్యోగాలు కల్పించేలా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొనసాగిన ఆధిపత్య పోరు
పోలవరం నియోజకవర్గంలో లోకేష్‌ పర్యటన సందర్భంగా టిడిపిలో ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొరగం శ్రీనివాస్‌, మాజీ ఎంఎల్‌ఎ మొడియం శ్రీనివాస్‌ మధ్య ఆధిపత్య పోరు నెలకొన్న సంగతి తెలిసిందే. ఫెక్ల్సీల ఏర్పాటులో బొరగం శ్రీనివాస్‌ ఫొటో చిన్నదిగా పెట్టడం వంటి విషయాలపై ఇరుగ్రూపుల్లో పోటీ నెలకొంది. ఆ కారణంగానే పోలవరం నియోజకవర్గంలో సాగిన యాత్రలో మిగిలిన చోట్ల కంటే జనాదరణ తగ్గిందనే చర్చ నడిచింది.