ప్రజాశక్తి -విఆర్ పురం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఏ ఒక్క నిర్వాసితునికి అన్యాయం జరగకుండా చూడటమే తమ బాధ్యత అని తహశీల్దారు ఎం.శ్రీధర్ తెలిపారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ గ్రామసభ మండలంలోని ఒడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధి సాయిబాబా గుడి వద్ద సర్పంచ్ నరసమ్మ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. నిర్వాసిత కుటుంబాల లిస్ట్‌ను వాలంటీర్లు కస్టర్లవారీగా చదివి వినిపించారు. ఈ లిస్ట్‌ల్లో నిర్వాసిత కుటుంబాల పేర్లుగాని, వారి వివరాలుగాని తప్పుగా ఉంటే ఒడ్డుగూడెం పంచాయతీ కార్యదర్శి స్వరూప రెడ్డి వద్ద మార్పులు చేర్పులు చేసుకోవాలని తహశీల్దారు తెలిపారు. ఈ సందర్భంగా తహశీల్దారు, ఎంపీపీ కారం లక్ష్మి, జెడ్పిటిసి వాళ్ల రంగారెడ్డి మాట్లాడుతూ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి కటాఫ్ డేట్ 2022 నవంబర్ 18గా నిర్ణయించారని, ఆ రోజుకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి అర్హులని పేర్కొన్నారు. 950 నిర్వాసిత కుటుంబాలకు నష్టపరిహారం, అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చిన తర్వాతే తరలింపు ఉంటుందని చెప్పారు. ఆర్‌ఆర్ కమిటీ మెంబర్ వి.గాంధీబాబు మాట్లాడుతూ నిర్వాసితులందరూ కలిసికట్టుగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండి గ్రామ సభలు సక్రమంగా జరిగే విధంగా చూసుకోవాలని సూచించారు. వివాదాలకు పాల్పడవద్దని, అలా చేస్తే నష్టపోయేది నిర్వాసితులేనని, అడగవచ్చుగాని, విషయం పక్కదోవ పట్టే విధంగా ఉండకూడదని సూచించారు. ప్రభుత్వం కేటాయించిన పునరావాస కేంద్రంలో ఇంటి నిర్మాణానికి నిర్వాసితులే ఒక కమిటీగా ఏర్పడి అక్కడి స్థితిగతులను చూసుకోవాలని తెలిపారు. ఈ గ్రామసభలో ఆర్‌ఐలు రామకృష్ణ, యేసుబాబు, పంచాయతీ కార్యదర్శి స్వరూప రెడ్డి, ఎంపీటీసీ, ఉపసర్పంచ్, విఆర్‌ఒ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.










