Jul 31,2023 22:55

వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: వంశధార ప్రాజెక్టు నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన నిర్వాసితుల్లో కొందరికి మాత్రమే అదనపు నష్ట పరిహారం అందించారని, అందరికీ చెల్లించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, హిరమండలం జెడ్‌పిటిసి బుచ్చిబాబు కలెక్టర్‌ను కోరారు. జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. తన తండ్రికి ప్రభుత్వం ఇచ్చిన డి-పట్టా భూమిని ఆక్రమణదారులు, రెవెన్యూ అధికారులు చేతుల కలిపి ఆక్రమించుకున్నారని ఇచ్ఛాపురం మండలం ఈదుపురానికి చెందిన దళిత మహిళ ఫిర్యాదు చేసింది. భూమిని అప్పగించాలని కోరారు. వంశధార కాలువపై గేదెలవానిపేట వద్ద నిర్మించిన వయోడెక్ట్‌ శిథిలావస్థకు చేరుకుందని, మరమ్మతులు చేపట్టి రైతాంగానికి సాగునీరందించాలని పలువురు రైతులు కోరారు. జీడి పంటకు గిట్టుబాటు ధర చెల్లించాలని రైతులు ఉద్యమిస్తున్నా జిల్లా యంత్రాంగంలో స్పందన లేదని, తక్షణమే పరిశ్రమల యజమానులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని మహేంద్ర చైతన్య రైతుసంఘ నాయకులు కొర్ల హేమారావు చౌదరి వినతిపత్రం అందజేశారు. ఒకవైపు రైతులు ఆందోళనకు గురవుతుంటే ఇతర ప్రాంతాల నుంచి పరిశ్రమల యజమానులు జీడిపిక్కలను దిగుమతి చేసుకుంటున్నారని, దీనివల్ల రైతాంగానికి తీరని నష్టం వాటిల్లుతోందన్నారు. 80 కిలోల జీడిపిక్కల బస్తాకు రూ.16వేలు మద్దతు ధర చెల్లించాలని కోరారు. పాఠ్యపుస్తకాల పంపిణీ కోసం ఎండియు వాహనాలను వినియోగించుకున్న విద్యాశాఖ అథికారులు ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీలు చెల్లించలేదని ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. వీటితో పాటు వ్యక్తిగత, సామాజిక సమస్యలపై పలువురు వినతులు అందజేశారు. జిల్లావ్యాప్తంగా 201 వినతులను స్పందనలో స్వీకరించారు.
అధికారుల గైర్హాజరుపై ఆగ్రహం
స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని, ఎవరైనా అనుమతి లేకుండా గైర్హాజరైతే చర్యలు తప్పవని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ హెచ్చరించారు. స్పందన కార్యక్రమంలో అధికారులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందనకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్పందనకు వచ్చే వినతులను సకాలంలో పరిష్కారం కావాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, డిఆర్‌ఒ మురళీకృష్ణ, ఉప కలెక్టర్‌ జయదేవి, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌, జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌, డిఎస్‌ఒ వెంకటరమణ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.