Dec 20,2022 22:20

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
       పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులు ఇప్పటికీ తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని చల్లవారిగూడెంలోని పునరావాస కాలనీలో సిపిఎం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ పోలవరం పేరులో వరం ఉన్నా త్యాగం చేసిన వారికి శాపంలా మారిందన్నారు. వరదల సమయంలో సాయం కోరి వస్తే ఇప్పటికి పరిహారం, వరద సాయం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. నిర్వాసితులకు ఇక్కడ పనుల్లేక పస్తులుంటున్నారని వాపోయారు. ఐదు గ్రామాలకు ఒక్కటే మంచినీటి ట్యాంక్‌ ఉందని తెలిపారు. శ్మశానవాటిక లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సౌర విద్యుత్‌ ఉన్నా వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరెంట్‌ బిల్లులు సంవత్సరం వరకు కట్టనవసరం లేదని ప్రచారం చేస్తూనే వేల రూపాయల్లో బిల్లులు ఇవ్వడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు తెల్లం రామకృష్ణ, మానుకొండ జీవరత్నం, గుడెల్లి వెంకట్రావు, తెల్లం దుర్గారావు, వై.నాగేంద్రరావు, కారం భాస్కర్‌, పోలోజు నాగేశ్వరరావు, ఎ.ప్రభాకరరావు, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.