Dec 03,2022 23:54

ఆర్‌డిఒకు వినతిపత్రం ఇస్తున్న తిమ్మరాజుపేట నిర్వాసితులు

ప్రజాశక్తి-మునగపాక రూరల్‌
అనకాపల్లి - అచ్యుతాపురం రోడ్డు విస్తరణ నిర్వాసితులకు పరిహారం అందించే విషయంలో సమన్యాయం చేయాలని సిఐటియు మండల నాయకులు ఎస్‌.బ్రహ్మాజీ, టిడిపి నాయకులు భీమరశెట్టి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మండలంలోని తిమ్మరాజుపేట నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం అనకాపల్లి ఆర్డీవో చిన్నికృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్తిస్థాయి సమాచారం లేకుండా నవంబర్‌ 30న తిమ్మరాజుపేట గ్రామానికి వచ్చిన ఆర్డీవో జనాలు లేకుండానే నలుగురైదుగురుతో పరిహారం గురించి మాట్లాడం ఏమిటని ప్రశ్నించారు. మునగపాక, నాగులపల్లి గ్రామాలలో ప్రకటించిన పరిహారం కన్నా తిమ్మరాజుపేట గ్రామానికి తక్కువ పరిహారం ఇవ్వడం అన్యాయమన్నారు. తిమ్మరాజుపేటలో ఇంటర్నేషనల్‌ స్కూలు, నీట్‌ కోర్సు కేంద్రం, ఇఎన్‌టి హాస్పిటల్‌ ఉన్నాయని, అభివృద్ధిలో మునగపాక, నాగులపల్లి కంటే ముందున్న తిమ్మరాజుపేటలో భూముల విలువల కూడా సమానంగా సరితూగుతుందని తెలిపారు. కావున తిమ్మరాజుపేట గ్రామానికి ప్యాకేజీ విషయంలో సమన్యాయం చేయాలని, లేకుంటే భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నిర్వాసితుల సంఘం కార్యదర్శి బుద్ధ రంగారావు, తిమ్మరాజుపేట నిర్వాసితులు శరగడం గోవింద, తులసిరావు, శరగడం వెంకట చంద్రరావు, దాడి వెంకట మహాలక్ష్మి నాయుడు, సరగడం అప్పలనాయుడు ఉన్నారు.