Jun 29,2023 22:24

విలేకర్లతో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి - గుంటూరు : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని కోరుతూ జూన్‌ 20 నుంచి జూలై4వ తేదీ వరకు సాగుతున్న పోలవరం నిర్వాసితుల పాదయాత్రకు మద్దతు తెలియజేయాలని ఉద్యోగులు, కార్మికులకు సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ, కార్యదర్శి బి.లక్ష్మణరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పాతగుంటూరులోని జిల్లా కార్యాలయంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. నిర్వాసితుల సమస్య పరిష్కారం కోసం జరుగుతున్న పాదయాత్రకు సంఘీభావంగా ఉద్యోగులు, కార్మికులు తమవంతు సహకారం అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు వల్ల మూడు మండలాల్లోని వేలాది మంది ప్రజలు సర్వం కోల్పోతున్నారని, వారిని ఆదుకోవడానికి జరిగే పోరాటానికి ప్రజలందరూ ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. జూలై 1వ తేదీన జిల్లాలో పోలవరం నిర్వాసితుల పోరాట సంఘీభావ నిధి వసూలు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.