Jul 30,2023 21:40

పునరావాస పరిహారం చెల్లించాలి
వరద బాధితులను ఆదుకోవాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి రవి
ముంపు ప్రాంతాల్లో పార్టీ జిల్లా బృందం పర్యటన
ప్రజాశక్తి - కుక్కునూరు

ప్రతి ఏడాదీ వచ్చే గోదావరి వరదల్లో ముంపు మండలాలను ముంచుతూ అటు ప్రభుత్వాలు, ఇటు అధికారులు కాలం గడుపుతున్నారు తప్ప వారికి ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి విమర్శించారు. ఆదివారం గోదావరి వరదలు మండలాన్ని ముంచెత్తడంతో గ్రామాలను ఖాళీ చేసి రావికుంట పునరావాస కాలనీలో ఉంటున్న గొమ్ముగూడెం, బెస్తగూడెం ఎస్‌సి కాలనీ, వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము గ్రామాలకు చెందిన వరద కుటుంబాలుంటున్న కాలనీల్లో పర్యటించి వారిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరదల వల్ల ఏయేటికాయేడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మరుగుదొడ్లు లేక మహిళలు, ఆడపిల్లల ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నాళ్లిలా బతకాలని సిపిఎం బృందం ముందు వరద బాధితులు తమ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఎ.రవి మాట్లాడుతూ ఏడేళ్లుగా అదిగో పరిహారం ఇదిగో పరిహారం అంటూ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేస్తున్నారు తప్ప నిర్వాసితులకు పరిహారం మాత్రం ఇవ్వడం లేదని, వారికివాల్సిన పరిహారం ఇచ్చి ఇక్కడి నుండి తరలిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ప్రభుత్వం నిర్వాసితులను పట్టించుకోకుండా అనాలోచిత నిర్ణయాల వల్లే ముంపు మండలాల్లో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. తక్షణం నిర్వాసితులకు పూర్తిపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తక్షణం వరద బాధిత కుటుంబాలకు ఇక్కడ ఉన్నంతకాలం వారికి భోజన ఏర్పాట్లు చేయాలని, అవసరమైన బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇవ్వాలని, కాలనీల్లో తాగునీరు, విద్యుత్‌, వైద్యం, పారిశుధ్యం, మరుగుదొడ్లు, రోడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు పరిహారం, ఇంటి నష్టం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పరిహారం చెల్లించి నిర్వా సితులకు న్యాయం చేయాలని కోరుతూ వరద బాధితులతో కలిసి రహదారిపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.కిషోర్‌, తెల్లం రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు దుర్గారావు, వై.నాగేంద్రరావు పాల్గొన్నారు.