Nov 10,2022 23:26

కొనసాగిన పోలవరం నిర్వాసితుల రిలే దీక్షలు
ప్రజాశక్తి - కుక్కునూరు

                పోలవరం నిర్వాసితుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని నిర్వాసితుల సంఘం నాయకులు వై.సాయికిరణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన రిలే దీక్షలు గురువారానికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాసితుల సంఘం నాయకులు సాయికిరణ్‌ మాట్లాడుతూ మాధవరం, కౌండిన్యముక్తి, యల్లప్పగూడెం, బెస్తగూడెం గ్రామాలను 41.15 కాంటూర్‌లో చేర్చాలని, గోదావరి వరదల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని, నాలుగు రోజుల నుండి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు నిర్వాసితులు చేస్తుంటే కనీసం అధికారులుగానీ, ప్రభుత్వంగానీ పట్టించుకోకపోవడంతోనే నిర్వాసితుల పట్ల ప్రభుత్వానికి ఎంతప్రేమ ఉందో అర్ధమవుతుందన్నారు. జులైలో వచ్చిన గోదావరి వరదలకు మునిగిన గ్రామాల్లో మొదటి గ్రామాలు మాధవరం, కౌండిన్యముక్తి, బెస్తగూడెం, యల్లప్పగూడెం గ్రామాలు అయితే అవి 41.15 కాంటూర్‌లో లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి 41.15 కాంటూర్‌లో ఈ నాలుగు గ్రామాలను చేర్చి పరిహారం వెంటనే ఇవ్వాలని, వరదల వల్ల పూర్తిగా పాడైన రహదారులను వెంకటాపురం నుండి లంకాలపల్లి వరకూ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలో నిర్వాసితుల సంఘం నాయకులు యర్నం సాయికిరణ్‌, కోట రామలక్ష్మి, మేడిపల్లి బాబు, నిర్వాసితులు కోట మోహన్‌రావు, మేడిపల్లి శ్రీను, కోట అలివేలు, మేడిపల్లి సాయమ్మ, గాలేటి లక్ష్మీ, సారంగి కృష్ణ, మోటా కాంతమ్మ పాల్గొన్నారు.