ప్రజాశక్తి - జీలుగుమిల్లి
మండలంలోని స్వర్ణ వారి గూడెంలో పోలవరం ముంపులో భాగంగా వేలేరుపాడు మండలంలోని కన్నాయిగుట్ట గ్రామ నిర్వాసితులకు ప్రభుత్వం 2016లో అర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో కొన్ని ఎకరాల భూమిని పంపిణీ చేసింది. సర్వే నంబర్ 47/1లో 2 ఎకరాల 58 సెంట్ల భూమిని మూయిబోయిన నారాయణమ్మకు కేటాయించారు. అప్పటి నుంచి వారు ఆ భూమిలో సాగులో ఉంటున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ఆ భూమిలో స్థానిక గిరిజనులు కొంతమంది కోర్ట్ ఆర్డర్ వుందని, ఆ భూమిలో మాకు హక్కులు వున్నాయని, మా భూమిని కబ్జా చేయడానికి చూస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులకు తెలిపినా ఫలితం లేకపోవడంతో, సోమవారం గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి మా భూసమస్య వెంటనే పరిష్కరిచాలని, మా భూమిని కబ్జా చేయాలని చూస్తున్న కబ్జా గాళ్లపై చర్యలు తీసుకోవాలని, లేనిచో ఇక్కడ నుంచి దూకి చనిపోతామంటూ బెదిరింపులు చేశారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ రెవెన్యూ, తహశీల్దార్ సుందర్ సింగ్, ఎస్‌ఐ చంద్రశేఖర్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని శాంతింపజేశారు. వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్‌డిఒతో మాట్లాడి భూమికి ప్రొటెక్షన్ కల్పిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించి వారు ట్యాంక్ నుంచి కిందకు దిగారు.










