ప్రయాణికులు, చిన్నారులు, వృద్ధుల ఇబ్బందులు
వినియోగంలోకి తీసుకురావాలని ప్రజల డిమాండ్
పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి - చింతలపూడి
చింతలపూడి పాత బస్టాండ్ వద్ద ఉన్న మినీ బస్టాండ్ ఎందుకు వినియోగంలోకి తీసుకురావడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసమర్థత, నిర్లక్ష్యమా, మాకేందుకులే ఆలోచన ధోరణి కారణమా అని విమర్శిస్తున్నారు. సుమరు 15 ఏళ్ల క్రితమే రూ.లక్షల వ్యయంతో నిర్మించిన మినీ బస్టాండ్‌ను నేటికీ వినియోగంలోకి తీసుకురావడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల ప్రజాధనంతో నిర్మించిన మినీ బస్టాండ్ నిరూపయోగంగా ఉందని, పట్టించుకోవాలని అధికారులకు పలుమార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మించి ఉన్న మినీ బస్టాండ్‌ను వినియోగంలోకి తీసుకురావడంలో ఎందుకు విఫలమవుతున్నారన్నారు. పట్టణం నుంచి ప్రతిరోజు ఏలూరుకు అనేక మంది ప్రయాణిస్తూ ఉంటారు. ప్రయాణికులు ఎండలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నిరూపయోగంగా ఉన్న మినీ బస్టాండ్‌ను ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
తోర్లపాటి లక్ష్మీకాంతం, పాత చింతలపూడి
చింతలపూడి పాత బస్టాండ్ వద్ద లక్షల రూపాయలతో నిర్మించిన మినీ బస్టాండ్ నిరూపయోగంగా ఉంది. మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం ఎండలో ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్ల సౌకర్యాలు కూడా లేని పరిస్థితి. అధికారులు స్పందించి బస్టాప్‌ను వినియోగంలోకి తీసుకురావాలి.
త్వరలోనే వినియోగంలోకి తీసుకొస్తాం
నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్
బస్టాండ్‌ను త్వరలోనే వినియోగంలోకి తీసుకొస్తాం. ఇప్పటికే ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రయాణికుల, మహిళల, వృద్ధుల, చిన్నారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అతి త్వరలోనే బస్టాండ్‌ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.










