Nov 19,2023 01:20

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధాని అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం నిలిచిపోవడంతో 25 లే అవుట్‌లు నిరుపయోగంగా మారాయి. నాలుగు నెలలు దాటినా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రత్యామ్నాయమూ చూపకపోవడంతో 50వేల మంది లబ్ధిదారులు అయోమయంలో చిక్కుకున్నారు. రాజధాని అమరావతి పరిధిలో గుంటూరు, ఎన్‌టిఆర్‌ జిల్లాలకు చెందిన 50,793 మంది పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో సిఎం జగన్‌ జులై 24న శంకుస్థాపన చేశారు. ఆగస్టు 8న హైకోర్టు ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు ఇచ్చింది. సిఆర్‌డిఎ చట్టం ప్రకారం ఇళ్లనిర్మాణం జరగడంలేదని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం దిద్దుబాటుచర్యలు చేపట్టలేదు.
రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాలను ఈ ఏడాది మే 26న సిఎం జగన్‌ పంపిణీ చేశారు. అదేరోజు రాజధానిలో ఇళ్ల నిర్మాణానికి జులై 8న తాను శంకుస్థాపన చేస్తానని సిఎం జగన్‌ స్థలాల పంపిణీ సందర్భంగా వెంకటపాలెంలో జరిగినసభలో ప్రకటించారు. ఈమేరకు మే 26 నుంచి జులై మూడో తేదీవరకు అధికారులు హడావుడి చేశారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వలేదు. స్థలాల పంపిణీ న్యాయవివాదాల్లో ఉండటంతో కేంద్రం నిధులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో జులై 8న జరగాల్సిన ఇళ్లనిర్మాణంను వాయిదా వేశారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ఇళ్లు నిర్మించేలా ప్రతిపాదనతో శంకుస్థాపన చేయగా ఆగస్టు 3వ తేదీన కోర్టు ఉత్తర్వులతో ఈ ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. ఆర్‌-5 జోన్‌లో ఇళ్లనిర్మాణాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించినా ప్రభుత్వానికి సానుకూలత రాలేదు. సార్వత్రిక ఎన్నికల లోపు రాజధానిలో ఇళ్ల నిర్మాణం జరిగే పరిస్థితిలేదు. 50 వేల మంది లబ్ధిదారులకు రెండు జిల్లాల పరిధిలో ఇళ్ళ స్థలాలపై ఇప్పటివరకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపలేదు. దాదాపు రూ.250 కోట్లతో రూపొందించిన లేఅవుట్‌లలో మౌలిక సదుపాయాలు నిరుపయోగంగా మారాయి. మరో 100 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వచ్చే అవకాశం ఉండటం, ఈ లోగా 50 వేల మందికి ఇళ్ల నిర్మాణం ఎలా ఉన్నా,తమ జిల్లాల పరిధిలో స్థలాలు అయినా ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. గతంలో జగనన్నకాలనీల్లో లబ్ధిదారులు నివశించే ప్రాంతాలకు కొంత దూరంలో స్థలాలు కేటాయించారు. కానీ గుంటూరు,ఎన్‌టిఆర్‌జిల్లాల వారిలో 50 వేలమందికి రాజధానిలో కేటాయిస్తామని 2020- 2021లో పెండింగ్‌లో ఉంచారు. పలు న్యాయ వివాదాల మధ్య ఈ ఏడాది మే నెలలో స్థలాల పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణం ప్రారంభించకముందే హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ 50 వేల మందికి ఎప్పటికి ఇళ్ల స్థలాలు దక్కుతాయన్నదీ ప్రశ్నార్ధకంగామారింది.