Nov 08,2023 21:53

నిరుపయోగంగా పడి ఉన్న మార్కెట్‌ యార్డు గోడౌన్లు

ప్రజాశక్తి-వీరఘట్టం : స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాములు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్‌ యార్డు స్థలంలో రెండు గోదాములతోపాటు రెండు విశాలమైన రేకుల షెడ్లను రెండు దశాబ్దాల కిందట లక్షలాది రూపాయలతో నిర్మించారు. రైతులు పండించిన పంటను ఆరబెట్టుకోవడంతోపాటు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు నిల్వ ఉంచుకునేందుకు వీలుగా అప్పట్లో వీటిని ఎఎంసి అధికారులు నిర్మించారు. ఇవి మూణ్నాళ్ల ముచ్చటగా పనిచేసి మూలకు చేరాయి. దీంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయ.
శిక్షణలకు వినియోగం
2008-09 ఆర్థిక సంవత్సరంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మార్కెట్‌ యార్డు గోడౌన్లో ఎలక్ట్రికల్‌, తాపీ మేస్త్రీల రెండు మూడు బ్యాచుల వరకు శిక్షణలు ఇచ్చేవారు. తరువాత వ్యవసాయ పరపతి సంఘం ద్వారా మండల స్థాయి రైతులకు విత్తనాలు విక్రయించేందుకు ఒకట్రెండేళ్లు వినియోగించేవారు. ఉపాధి హామీ ద్వారా ఇక్కడే మొక్కలు ఉంచి అవసరమైన రైతులకు పంపిణీ చేసేవారు. తరువాత ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించక పోవడంతో గోడౌన్ల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. విషసర్పాలకు ఆవాసాలుగా మారాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
సంతను నిర్వహించేందుకు..
మార్కెట్‌ యార్డులోనే నాణ్యమైన సరుకులతోపాటు మార్కెట్‌ ధర కంటే రూపాయి తక్కువకు విక్రయాలు జరిపేందుకు వీలుగా 2012 అక్టోబర్‌లో అప్పటి కేంద్ర గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి వైరుచర్ల కిషోర్‌ చంద్రదేవ్‌ సంతను నిర్వహించేందుకు అట్టాహాసంగా ప్రారంభించారు. గిరిజనులు పండించే ఉత్పత్తులను ఇక్కడికి తీసుకురావడంతో స్థానిక వ్యాపారులకు బేరాలుండేవి కాదు. దీంతో వ్యాపారులంతా సిండికేట్‌గా మారి గిరిజనుల ఉత్పత్తులను మార్గం మధ్యలో కొనుగోలు చేసి సంతను నిర్వహించకుండా చేశారు. ఇక్కడ సంత జరిగితే మార్కెట్‌ కమిటీతోపాటు పంచాయతీకి కూడా ఆదాయం వచ్చే అవకాశాలుంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సంత నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. దళారుల వల్ల ఆ అవకాశం కూడా లేకపోయింది.
మరమ్మతుల కోసం నిధులకు ప్రతిపాదన
ఎఎంసి గోడౌన్ల మరమ్మతులతోపాటు రైతు బజార్‌ ఏర్పాటు చేసేందుకు రూ.38 లక్షలతో పనులు చేపట్టేందుకు ఏడేళ్ల కిందట మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ద్వారా నిధులు మంజూరయ్యాయి. రెండు పర్యాయాలు టెండర్లు పిలిచినప్పటికీ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని అప్పటి మార్కెటింగ్‌ శాఖ ఎడి బి.శ్రీనివాసరావు తెలిపారు.
ఇదే విషయమై పాలకొండ వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శి స్రవంతి వద్ద 'ప్రజాశక్తి' ప్రస్తావించగా గోడౌన్ల మరమ్మతుల కోసం ప్రతిపాదన చేశామని, నిధులు మంజూరు కాలేదని ఆమె వివరణ ఇచ్చారు.