Jan 01,2023 17:30

పంచాయతీ అధికారులతీరుపై గ్రామస్తుల విమర్శలు
ప్రజాశక్తి - ముదినేపల్లి

               ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించే రిక్షాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. మండలంలోని అనేక గ్రామాల్లో ఈ పరిస్థితి కనబడుతోంది. వడాలి, గురజ తదితర గ్రామాల్లో ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించడానికి ప్రభుత్వం వేలాది రూపాయాలతో రిక్షాలను కొనుగోలు చేసి గ్రామాలకు అందించారు. అనేక గ్రామాల్లో ఈ రిక్షాలు నిరూపయోగంగా పక్కన పడేసి ఉన్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిలో కొన్ని రిక్షాలు ఇప్పటికే తప్పుపట్టి శిథిలావస్థకు చేరాయి. ప్రభుత్వం ఎంతో ఖర్చుచేసి పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినా కిందిస్థాయిలో మాత్రం ఆశించిన ఫలితాలు కనిపించడంలేదని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో చెత్త సేకరణ సక్రమంగా జరగడంలేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. పారిశుధ్యంపై అధికారులు దృష్టి పెట్టడం లేదని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో తమ గ్రామాలకు చెత్త సేకరణ రిక్షాలు అసలు రావడంలేదని గ్రామస్తులు చెబుతున్నారు. తాము ఇప్పటివరకు చెత్త రిక్షాలను చూడలేదని పలు కాలనీలకు చెందిన కాలనీ వాసులు చెబుతున్నారు. కొన్ని పంచాయతీలకు రిక్షాల నిర్వహణ, కార్మికుల జీతాలు చెల్లింపు వంటివి భారంగా మారడంతో వీటిని మూలనపడేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుధ్యంపై దృష్టి పెట్టి నిరూపయోగంగా పడి ఉన్న రిక్షాలతో చెత్త సేకరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.