Jul 12,2023 21:00

నిరుపయోగంగా ఉన్న బస్‌షెల్టర్‌

ఎర్రగుంట్ల : మున్సిపాలిటీ పరిధిలో పలు బస్‌ షెల్టర్లు నిరుపయోగంగా మారాయి. ప్రజలకు ఉపయోగకరమైన బస్‌షెల్టర్లను అటు అధికారులు గానీ, ఇటు నాయకులు గానీ గాలికి వదిలేశారు. పేద, మధ్యతరగతి ప్రజలు తరచూ బస్సుల్లో ప్రయాణిస్తూంటారు. వీరు బస్‌ కోసం వేచి ఉండే సమ యంలో ఎండ, వానకు ఇబ్బందులు పడకూడదనే మానవతా దృక్ఫథంతో పోట్లదుర్తి గ్రామానికి చెందిన దివంగత మాజీ టిటిడి బోర్డు సభ్యులు చింతకుంట సత్యనారాయణ నాయుడు కొన్నేళ్ల క్రితం తన సొంత నిధులు వెచ్చించి పట్టణంలో పలు ప్రాంతాల్లో బస్‌షెల్టర్‌లను నిర్మించారు. అందులో ఒకటి రైల్వేస్టేషన్‌ వెలుపల, ఇంకొకటి ప్రకాష్‌ నగర్‌ వద్ద, మరొకటి వేంపల్లి రోడ్డులోని ఆసనం వద్ద ప్రజలు బస్సు కోసం వేచి ఉండే సమయంలో కూర్చునేలా నిర్మించారు. వీటికి సంబంధించి దాదాపు రూ.6 నుండి రూ.8 లక్షలు సొంత డబ్బును సత్యనారాయణ నాయుడు ఖర్చు చేశారు. అధికారుల, నాయకుల నిర్లక్ష్యంతో రైల్వేస్టేషన్‌ వెలుపల ఉన్న బస్‌షెల్టర్‌, ప్రకాష్‌ నగర్‌లో ఉన్న బస్‌షెల్టర్‌ నిరుపయోగంగా మారాయి. ఒక్క వేంపల్లి రోడ్డులోని ఆసనం వద్దనున్న బస్సుషెల్టర్‌ మాత్రమే మనుగడలో ఉంది. ప్రజల కనీస అవసరాలు తీర్చే పరిస్థితిలో కూడా అధికారులు, నాయకులు లేకపోవడం చాలా బాధాకరమని పలువురు పేర్కొంటున్నారు. బస్‌షెల్టర్లు పడిపోయే పరిస్థితి ఏమైనా ఉందా అంటే అలాంటిదేమీలేదు. బస్‌షెల్టర్‌ లోపల మట్టి కుప్పలు, కంప చెట్లు, వ్యర్థాలతో నిండి ఉన్నాయని, దీంతో ప్రయాణికులు బస్సుషెల్టర్‌ వెలుపల వేచి ఉండి వెళుతున్నారని స్థానికులు చెబుతున్నారు. సేవాభావంతో తమ సొంత నిధులతో నిర్మిస్తే.. కనీసం నిర్వహణ చేయాల్సిన బాధ్యత మున్సిపల్‌ అధికారులపై ఎంతైనా ఉంది. మునుపు ''మన ఊరి కోసం టీం'' పేరుతో పట్టణంలోని కొందరు యువకులు కలిసి రైల్వే వంతెనపై మొక్కల కుండీలను తమ సొంత నిధులతో ఏర్పాటు చేసినా, మున్సిపల్‌ అధికారులు వాటికి కనీసం నీరు కూడా పట్టకపోవడంతో అవి ఎండిపోయాయి.ఇప్పటికైనా బస్‌షెల్టర్లలోని మట్టిని, వ్యర్థాలను తొలగించి వాటిని మళ్లీ మనుగడలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, నాయకులను ప్రజలు కోరుతున్నారు.
అధికారులకు చెప్పి క్లీన్‌ చేయిస్తాం..
ఆర్‌టిసి బస్టాండ్‌ మాత్రమే మా పరిధిలోకి వస్తుంది. బయట ఉన్న బస్‌షెల్టర్లు ప్రయివేట్‌ వ్యక్తులు కట్టించారు. కానీ ప్రజల సౌకర్యార్థం కట్టించినవి కాబట్టి, మున్సిపల్‌ అధికారులకు తెలిపి క్లీన్‌ చేసేలా చర్యలు తీసుకుంటాం. - మల్లికార్జునరెడ్డి, ఆర్‌టిసి మేనేజర్‌, ప్రొద్దుటూరు డిపో
త్వరలోనే చర్యలు చేపడుతాం..
బస్‌షెల్టర్ల వద్ద వ్యర్థాలు, మట్టి పేరుకు పోయాయని, ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉందని తెలిసింది. అక్కడ శుభ్రం చేసేందుకు చర్యలు తీసు కున్నాం. అలాగే బస్సుషెల్టర్లకు రంగులు వేసేందుకు స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడుతున్నాం. తొందరలోనే ఆ పనులు చేస్తాం.
- పగడాల జగన్నాథ్‌, కమిషనర్‌, ఎర్రగుంట్ల మున్సిపాలిటీ