ప్రజాశక్తి - వినుకొండ : జాలలపాలెం వద్ద 175 ఎకరాల ప్రభుత్వ భూములను తాను ఆక్రమించినట్లు వస్తున్న ఆరోపణలను నిరూపించినా, తన భూముల్లో సెంటు భూమి అయినా ప్రభుత్వానికి ఉన్నా తన యావదాస్తి ఇచ్చేస్తానని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు. స్థానిక వైసిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. శ్రీవత్స ఫుట్‌పార్క్ లిమిటెడ్ పేరుపై అటవీ భూములు లేవని గతంలో అటవీ శాఖ నివేదించిదని అన్నారు. హైకోర్టు జడ్జిమెంట్‌ను చదవకుండానే టిడిపి నాయకులు వర్ల రామయ్య తప్పడు ఫిర్యాదు చేశారని వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు కావాలనే తనపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని అన్నారు. ఉప్పలపాడు, కొప్పుకొండ, ముప్పాళ్ల, ఖమ్మంపాడు, తదితర గ్రామాల్లో టిడిపి నాయకులు వారి కుటుంబ సభ్యుల పేరుపై భూములను ఆక్రమించారంటూ రికార్డులను చూపారు. ప్రభుత్వ భూములు మలుపురి ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఉన్నాయని, తనకున్న 200 ఎకరాల్లో 120 ఎకరాలు జగనన్న కాలనీకి ప్రభుత్వానికి అమ్మానని, మిగతా 80 ఎకరాల్లో 30 ఎకరాలు డైరీ ఫార్మ్, మరో 50 ఎకరాలు కౌ ఫామ్ పెడుతున్నట్లు వివరించారు. ఈ వాస్తవాలను పాదయాత్ర ద్వారా ఇంటింటికీ తిరిగి ప్రజలకు చెబుతానన్నారు.










