Aug 10,2023 00:11

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : సారా విక్రయాల ద్వారా వచ్చిన సంపాదనతో కట్టుకున్న ఇంట్లో ఉంటూ మరోవైపు వైసిపి ఎమ్మెల్యేలపై యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ ఆరోపణలు సరికాదని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. గురజాలలో టిడిపి-వైసిపి హయాంలలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, చర్చకు వస్తారా? అని లోకేష్‌, యరపతినేని శ్రీనివాసరావుకు సవాలు విసిరారు. ఈ మేరకు నరసరావుపేటలోని తన నివాసంలో బుధవారం మహేష్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాక సారా విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతోనే జూబ్లీ హిల్స్‌లో స్థలం కొని ఇల్లు కట్టించిన నివాసం ఉంటున్నారన్నారని ప్రజాయుద్ధనౌకగా పిలిచే గద్దర్‌ పలు సందర్భాల్లో తన పాటల ద్వారా ప్రజలకు చెప్పారని గుర్తుచేశారు. టిడిపి హయాంలో గురజాల నియోజకవర్గంలో రూ.2,265 కోట్లతో అభివృద్ధి చేశామని, అందులో రూ.2,020 కోట్లు సీసీ రోడ్లకు ఖర్చు చేశామన్న మాటకు లోకేష్‌ కట్టుబడి ఉంటారా అని ప్రశ్నించారు. 2014-19 మధ్య రూ.2 వేల కోట్లతో సీసీ రోడ్లు వేసినట్టు రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. లోకేష్‌ ఓడిపోతే క్షమాపణ చెబితే చాలని, లోకేష్‌ మాట్లాడుతుండగా పక్క నుంచి యరపతినేని తనను గజదొంగ అని పిలవాలని సలహా ఇచ్చినా లోకేష్‌ ఆ ప్రయత్నం చేయలేకపోయారని, యరపతినేని పెద్ద గజదొంగ కాబట్టే ఆ మాట లోకేష్‌ అనలేకపోయారని అన్నారు.
లోకేష్‌ పాదయాత్ర అబద్ధాలయాత్ర
ప్రజాశక్తి-పిడుగురాళ్ల :
నారా లోకేష్‌ చేస్తున్న యువగళం పాదయాత్ర అబద్ధాల యాత్ర అని పిడుగురాళ్ల మున్సిపల్‌ చైర్మన్‌ కొత్త చిన్నసుబ్బారావు విమర్శించారు. స్థానిక వైసిపి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పిడుగురాళ్లలో సున్నం వ్యాపారులపై అక్రమంగా రైడింగులు చేయించి ఇబ్బందులు పెట్టిన యరపతినేని ఇప్పుడు మాపై విమర్శలు చేస్తుంటే గురిగింజ చందంగా ఉందని అన్నారు. ఆర్యవైశ్యుల ఆస్తులు ఎవరు కాజేశారు ప్రజలకు తెలుసునన్నారు. 2024లో కాసు ఓడిపోతే నియోజకవర్గం వదిలి వెళ్లిపోయి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకుంటాడని మాట్లాడిన యరపతినేని గతంలో మంచికల్లు నుండి గురజాలకు పారిపోయి వచ్చింది ఎవరని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎన్నికల ముందు కాసు మహేష్‌రెడ్డి 15 అంశాలతో మేనిఫెస్టో ఇచ్చారని, అందులో 12 పూర్తి చేయగా మరో 3 త్వరలో పూర్తి చేస్తారని అన్నారు. వాలంటీర్‌ వ్యవస్థపై విమర్శలు చేసిన నారా లోకేష్‌ జన్మభూమి కమిటీలతో ప్రజల రక్తం తాగలేదా? అని అన్నారు. సమావే శంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కె.ముక్కంటి, జయాలుద్దిన్‌, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ కె.వెంకటేశ్వర్లు, మాజీ చైర్మన్‌ ఎమ్‌డి గఫార్‌, వైసిపి పట్టణ అధ్యక్షులు సిహెచ్‌ రామారావు కౌన్సిలర్లు కె.వాసుదేవరెడ్డి, కె.శ్రీను, జె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.