Nov 21,2023 23:04

ప్రజాశక్తి - సీతానగరం నిరుపేదల అభ్యున్నతి కోసమే భూమి పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌ అన్నారు. మంగళవారం మండలంలోని కాటవరం గ్రామంలో రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి రైతుల కుటుంబాలకు వ్యవసాయ భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ బ్రిటిష్‌ కాలం నాటి భూ సమస్యలకు సైతం ప్రభుత్వం పరిష్కార మార్గం చూపిందన్నారు. దశాబ్దాలుగా భూమి అనుభవిస్తున్న వారికే హక్కు పత్రాలను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో భూమిలేని 1296 మంది ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. నిరుపేదలకు1025 ఎకరాల అసైన్డ్‌ భూములను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 3182 మందికి 919 ఎకరాల లంక భూములకు హక్కు పత్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు. దశాబ్దాలుగా నిషేధిత భూముల జాబితాలోని 1809 మందికి చెందిన 1564 ఎకరాల అసైన్డ్‌ భూములకు భూమి హక్కులు అందిస్తున్నట్లు వివరించారు. ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో అభివృద్ధి, సంక్షేమంతోపాటు అనేక రకాల పరిపాలనా సంస్కరణలను సిఎం జగన్‌ తీసుకొచ్చారని తెలిపారు. బిసి, ఎస్‌సి, మైనారిటీలకు చాలా కాలం నుంచి వారి ఆధీనంలో ఉన్న భూమికి సైతం హక్కు లేకుండా ఇబ్బందులు పడ్డారని, వారందరికీ ఆ భూమిపై పూర్తి స్థాయిలో హక్కు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి జి.జ్యోస్నా, జడ్‌పిటిసి సిహెచ్‌.వెంకటలక్ష్మి, వైసిపి నాయకులు జి.శ్రీను, కె.హరిబాబు, కె.ముత్యాలు, జి.త్రిమూర్తులు, ఎ.రాజు, మద్దాల కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.