ప్రజాశక్తి-గొలుగొండ : మండలంలోని కొత్త ఎల్లవరం చెరువు దగ్గర కూల్చివేసిన మహిళ ఇల్లును సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు, మండల కార్యవర్గ సమితి సభ్యులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు గృహ సౌకర్యం కల్పిస్తామని ఒకవైపు ముఖ్యమంత్రి ప్రకటిస్తుంటే, మరో పక్క కొత్త ఎల్లవరం చెరువును ఆనుకొని ఉన్న మూడు కుటుంబాలు ఇల్లు, గుడిని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ సిబ్బంది, పోలీస్ యంత్రాంగంతో వచ్చి కూల్చేయడం దారుణమన్నారు. ఒక నిరుపేద మహిళ బోరున విలపించినా, కర్కశంగా ఆమె ఇంటిని కూల్చేయడంతో రోడ్డున పడిన ఆ కుటుంబం గుడిలో తలదాచుకోవాల్సిన దుస్థితి కల్పించారన్నారు.
30ఏళ్లుగా నివాసముంటూ, ప్రభుత్వపరంగా అన్ని గుర్తింపుకార్డులున్నప్పటికీ,మహిళ ఇంటిని కూల్చేయడం దుర్మార్గమని, దీనిపై తక్షణమే ప్రభుత్వ అధికారులు, స్థానిక సర్పంచ్, ఎమ్మెల్యే స్పందించి, నిరుపేద మహిళలకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు ఎటువంటి నోటీసులు, భరోసా ఇవ్వకుండా రోడ్డు మీదకి నెట్టేసిన రెవెన్యూ సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యాన ఆందోళన చేపడతామన్నారు.కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేకా సత్యనారాయణ, మండల కార్యదర్శి మేకా భాస్కరరావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు జి రాధాకృష్ణ, కార్యవర్గ సమితి సభ్యులు, మాజీ ఎంపిటిసి శెట్టి పైడియ్య, పైల మాణిక్యం పాల్గొన్నారు.










