Sep 29,2022 23:05

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎ.రెహమాన్‌

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని వుడా మాజీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎస్‌ఎ.రెహమాన్‌ చెప్పారు. ఎవిఎన్‌ కాలేజీకి ఎదురుగా ఉన్న కమ్యూనిటీ హాల్లో గురువారం సెంటర్‌ అఫ్‌ ఎక్స్‌ లెన్స్‌ ఇన్‌ మెరిటైం, షిప్‌ బిల్డింగ్‌(సిఇఎంఎస్‌)సహకారంతో ఏర్పాటుచేసిన శిబిరంలో ఆయన మాట్లాడారు. షిప్‌యార్డు, గాంధీగ్రామ్‌లో ఏర్పాటుచేసిన సిఇఎంఎస్‌లో నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడంతోపాటు ఉద్యోగాలు కూడా కల్పిస్తారని పేర్కొన్నారు. ఐటిఐ మొదలుకొని ఇంజినీరింగ్‌ డిగ్రీ వరకు చదువుకున్న విద్యార్థులకు శిక్షణ ఇస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చైతన్య స్రవంతి అధ్యక్షులు డాక్టర్‌ షిరీన్‌ రహమాన్‌ మాట్లాడుతూ, సుమారు ఐదు కోర్సుల్లో సిఇఎంఎస్‌లో శిక్షణ ఇస్తారని, రెండు నెలల శిక్షణ అనంతరం ఉద్యోగాల్లో నియమితులు కానున్నారని తెలిపారు. యువత కోసం చైతన్య స్రవంతి ఈ ప్రోగ్రామ్‌ను డిజైన్‌ చేసిందని, నిరుద్యోగులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిఇఎంఎస్‌ సిఇఒ సేతు మాధవన్‌ మాట్లాడుతూ, విశాఖపట్నం పోర్టు సహకారంతో గాంధీ గ్రామ్‌లో ఏర్పాటుచేసిన సెంటర్‌లో అక్టోబర్‌ 10 నుంచి దాదాపు 100 మందికి శిక్షణ ఇవ్వదలిచామని, ఇది ఉచితమని చెప్పారు. ట్రైనింగ్‌ పొందిన వారందరికీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా కాన్సెప్ట్‌తో ఈ కార్యక్రమం రూపొందించామని చెప్పారు. ట్రైనింగ్‌ సమయంలో ఎటువంటి స్టైఫండ్‌ ఇవ్వబోమని, సొంత ఖర్చులతో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఇఎంఎస్‌ మేనేజర్‌ ఎన్‌.కనకరాజు, హెడ్‌ మొబిలైజర్‌ ఎస్‌.కృష్ణ, చైతన్య స్రవంతి ప్రతినిధులు రుకియా భాను, విజయ శారద తదితరులు పాల్గొన్నారు.