కడప : ముఖ్యమంత్రి కడప జిల్లా పర్యటన వల్ల నిరు ద్యోగులకు ఒరిగిందేమీ లేదని రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయమని అడగడమే నేరమా జగనన్న అని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండి సుమంత్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జా తిరుమలేష్ ప్రశ్నించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలోని కడప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనలకే పరిమితమై నేడు సమాధి రాళ్లుగా ఎక్కిరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరమూ మెగా డీఎస్సీ ద్వారా 50 వేలు ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి చేస్తామన్న మాట నీటి బుడగలాగే మిగిలిందన్నారు కొప్పర్తి పారిశ్రామిక వాడలో ప్రచారమే తప్పక పరిశ్రమలు రాలేదన్నారు. రూ.55 కోట్లతో దేవుని కడప చెరువు, రూ.30 కోట్లతో బుగ్గ వంక సుందరీకరణలు ఎప్పుడు జరుగు తాయి అన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు ఇప్పటికీ పునరావాసం దక్కలేద న్నారు. యుద్ధ ప్రాతిపదికన శంకుస్థాపన చేసిన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డిసిసి ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రొద్దుటూరు అసెంబ్లీ అధ్యక్షుడు వంశీ యాదవ్, సుల్తాన్ మోహిద్దీన్ పాల్గొన్నారు.










