Sep 03,2023 22:09

సమావేశంలో మాట్లాడుతున్న పాశం రామారావు

ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు మరిచి, ఉపాధి అవకాశాలను నిర్వీర్యం చేసే చర్యలు చేపడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు విమర్శించారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం సమర భేరి కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో నిరుద్యోగ సమస్యపై రౌండ్‌టేబుల్‌ సమావేశం సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌ అధ్యక్షతన నిర్వహి ంచారు. సమావేశంలో వివిధ విద్యార్థి, యువజన సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పాశం రామారావు మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోడీ, రెండులక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, మరోవైపు నిరుద్యోగ సమస్య తాండవిస్తోందని అన్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో అధిక జీతాలున్న ఉద్యోగుల్ని తొలగిస్తు న్నారన్నారు. అగ్నిపథ్‌ పేరుతో భారత సైన్యంలో పర్మినెంట్‌ నియామకాలు లేకుండా నాలుగేళ్ల కాలానికి నియా మకాలు చేపడుతు న్నారన్నారు. భవన నిర్మాణ మెటీరియల్‌ ధరలు పెరగటంతో భవన నిర్మాణ కార్మికు లకు పనుల్లేక ఇబ్బంది పడుతున్నారని, యంత్రాల వాడకం వల్ల వ్యవసాయ రంగంలో కూలీలకు ఉపాధి తగ్గిపో యిందని చెప్పారు. వంద రోజులకు మించి పని ఉండట్లేదని, వలసలు పోతున్నారని అన్నారు. చిన్నచిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయని, నిరుద్యోగ సమస్యతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోందని, పారిశ్రామిక ఉత్పత్తుల కొనుగోలు నిలిచిపోతాయని, ఫలితంగా సంక్షోభం వస్తుందని వివరించారు. కావున నిరుద్యోగ సమస్యపై ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కె.నళినీకాంత్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని, క్రమం తప్పకుండా డిఎస్‌సి ద్వారా ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని వాగ్దానాలు చేసి విస్మరించిందన్నారు. సచివాలయ ఉద్యోగాలు తప్ప ఇతర ఉద్యోగాల ఊసే లేదని, ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క డిఎస్‌సి కూడా విడుదల చేయలేదని అన్నారు. మోడీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న పరిశ్రమలు మూతవేస్తూ నిరుద్యోగం మరింత పెంచుతోందని విమర్శించారు. డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ వై.కృష్ణకాంత్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనే చేయట్లేదన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే కేంద్ర ప్రభుత్వ శాఖలో 10 లక్షలు, ఒక్క రైల్వేలోనే 3 లక్షలు ఖాళీలున్నాయని చెప్పారు. ఎఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి వలీ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మంచి నిరుద్యోగుల్ని మోసం చేశారన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్‌ మాట్లాడుతూ పాఠశాలలు మూసివేస్తూ టీచర్‌ పోస్టుల ఖాళీలు భర్తీ చేయట్దేన్నారు. సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బైరగాని శ్రీనివాసరావు, ఆవాజ్‌ జిల్లా అధ్యక్షులు బాషా, ఐద్వా నగర కార్యదర్శి కల్యాణి, సిఐటియు నగర పశ్చిమ కార్యదర్శి బి.ముత్యాలరావు తదితరులు ప్రసంగించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నగర ఫ్రధాన కార్యదర్శి షేక్‌.ఖాసింవలి, ప్రైవేటు ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి సీతారామయ్య, ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి జి.శంకర్రావు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు టి.శ్రీనివాసరావు, సిఐటియు తూర్పు నగర కార్యదర్శి కె.శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు ఆది నికల్సన్‌, ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు షేక్‌.మస్తాన్‌వలి, మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు పి.శ్రీనివాసరావు, సిఐటియు పశ్చిమ నగర అధ్యక్షులు బి.సత్యనారాయణ పాల్గొన్నారు.