Sep 29,2023 21:50

రాష్ట్ర సదస్సు వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ
ప్రజాశక్తి - కొయ్యలగూడెం
   రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి సిపిఎం ఆధ్వర్యంలో అక్టోబర్‌ నాలుగో తేదీన రాజమండ్రిలో నిర్వహిస్తూ రాష్ట్రవ్యాప్త సదస్సును జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు ఆర్‌.లింగరాజు పిలుపునిచ్చారు. శుక్లబోయిన రాంబాబు ఇంటి వద్ద సదస్సు పోస్టర్లను మండల కార్యదర్శి రాంబాబు అధ్యక్షతన లింగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లింగరాజు మాట్లాడుతూ ప్రధానంగా వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలు మినహాయించి ఇంక ఎలాంటి ఉద్యోగ ప్రకటనలు చేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు లక్షలపైనే ఉద్యోగాలు ఉన్నాయని, అవి ఇప్పటిదాకా భర్తీ చేయలేదన్నారు. టీచర్లకు సంబంధించి డిఎస్‌సి పోస్టులు ఇప్పటి వరకు విడుదల చేయలేదన్నారు. తక్షణమే టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో చూస్తే ఏలూరులో జ్యూట్‌మిల్‌ పరిశ్రమ మూతపడటంతో వేలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకురాలు మోడియం నాగమణి, అందుగుల ప్రభాకర్‌, ఆకుల దుర్గారావు, కె.సీతారాములు, సిహెచ్‌ మరిడియా, గోపి, ఎస్‌.శివకుమార్‌, సిహెచ్‌ సత్యనారాయణ, బొబ్బర మంగరాజు, ఎన్‌.ప్రకాష్‌ రాజు పాల్గొన్నారు.
   బుట్టాయగూడెం : రాష్ట్రంలో నిరుద్యోగ యువత రోజురోజుకు పెరుగుతోంది, ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం ఆదివాసీ విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం యువతకు తీరని ద్రోహం చేసిందని, మోడీ చెప్పిన సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు లేవని విమర్శించారు. స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లేదంటే రాబోయే రోజుల్లో నిరుద్యోగంపై మరిన్ని పోరాటాలకు సన్నద్ధం కావాలని సిపిఎం నిర్వహిస్తున్న ఈ సదస్సు పిలుపునిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో యువతకు అండగా నిలబడేందుకు అక్టోబర్‌ 4వ తేదీన రాజమండ్రిలో విద్యావేత్తలు, మేధావులతో కలిసి సిపిఎం రాష్ట్ర సదస్సు నిర్వహిస్తోందని, ఈ సదస్సులో సిపిఎం ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రకటించనుందన్నారు. కావున యువతతో పాటు విద్యార్థులు, మేధావులు, వివిధ ప్రజాసంఘాలు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె.పృథ్వి రాజ్‌, కె.నవీన్‌, మహేష్‌, లక్ష్మి, శ్రీను పాల్గొన్నారు.