Sep 07,2023 19:33

మాట్లాడుతున్న డివైఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-కందుకూరు :విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని ఎస్‌ఎఫ్‌ఐ డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు ఎన్‌ శ్రీనివాసులు, ఎం.వి. రమణలు విమర్శించారు. జిల్లాలో విద్యారంగ,నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్‌ 5 నుంచి 10 వరకు జరుగుతున్న జీబు జాతా గురువారం కందుకూరు చేరింది. కందుకూరు పట్టణంలో టి ఆర్‌ ఆర్‌ కాలేజీ వద్ద ఉన్న ఎస్సీ కాలేజీ హాస్టల్‌ విద్యార్థినుల లతో, గుడ్లూరు రోడ్‌ లోని ఆక్స్‌ వర్డ్‌ కాలేజీ విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పామూరురోడ్డు చౌరస్తాలో జాతాను ఉద్దేశించి డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎంవి రమణ మాట్లాడారు.ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చారని, ఆచరణలో విస్మరించారని విమర్శించారు. రాష్ట్రంలో నేటికీ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయలేదని, నిరుద్యోగుల ఆశలను వమ్ము చేశారని విమర్శించారు. కేంద్ర, ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందని పేర్కొన్నారు. కందుకూరు నియోజకవర్గం లో రామాయపట్నం పోర్టు పరిధిలో పరిశ్రమలను స్థాపించి స్థానికులకు ఉద్యోగాలు ఉపాధి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆక్స్‌ వర్డ్‌ కాలేజీలో కాలేజీ విద్యార్థులు ఉద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసులు మాట్లాడారు. కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు విద్యారంగానికి కేటాయింపులు తగ్గించి కార్పొరేట్లకు విద్య మొత్తాన్ని అప్పజెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది జరిగితే గ్రామీణ ప్రాంతంలోని పేద విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. కందుకూరు పట్టణంలో ప్రభుత్వ పరిధిలో ఇంజనీరింగ్‌ కాలేజీ ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఐద్వా కందుకూరు పట్టణ కమిటీ జీబు యాత్రకు సంఘీభావం తెలిపింది. ఐద్వా జిల్లా నాయకురాలు ఎస్‌.కే. మున్వర్‌ సుల్తానా, ఎస్‌ఎఫ్‌ఐ ప్రకాశం జిల్లా మాజీ కార్యదర్శి జీవీబీ కుమార్‌ మాట్లాడారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు వి.నరేంద్రబి.బాలాజి,ఎన్‌.సుమంత్‌, డివైఎఫ్‌ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బి.పి నరసింహ, జిల్లా నాయకులు వంకదారి శ్రీనివాసులు,పి. నరసింహ,గోను.చైతన్య, ఎస్‌ఎఫ్‌ఐ కందుకూరు పట్టణ కమిటీ నాయకులు జయ కుమార్‌, షాలెం, ఐద్వా పట్టణ నాయకులు ఎం పద్మ, ఎస్‌ కే మల్లిక ఉన్నారు.