Oct 27,2023 22:00

బాబు షూరిటీ- భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమం బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-సాలూరు : లక్షలాది మంది నిరుద్యోగుల గొంతులను వైసిపి ప్రభుత్వం కోసిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు సంధ్యారాణి అన్నారు. శుక్రవారం టిడిపి పట్టణ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. గడచిన నాలుగేళ్లలో ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయలేదని చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయకపోవడంతో యువత పెడదారి పడుతున్నారని తెలిపారు. వాలంటీర్‌ ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. నియోజకవర్గ పరిశీలకులు విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ నవంబర్‌ ఒకటో తేది నుంచి ప్రారంభం కానున్న బాబు షూరిటీ - భవిష్యత్తుకి గ్యారెంటీ అన్న కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కోరారు. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్‌ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్‌, పాచిపెంట మండల అధ్యక్షులు పిన్నింటి ప్రసాద్‌ బాబు పాల్గొన్నారు.