Aug 23,2023 00:16

మాట్లాడుతున్న సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి లోకనాథం

ప్రజాశక్తి- అనకాపల్లి
నిరుద్యోగం, అధిక ధరలు, విద్యుత్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా ఈ నెల 28 నుండి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం ఆ పార్టీ శాఖలకు పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా ప్లీనం సమావేశం మంగళవారం స్థానిక దొడ్డి రామునాయుడు భవన్‌లో జరిగింది. ముందుగా పార్టీ సీనియర్‌ నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి పార్టీ పతాకావిష్కరణ చేశారు. అనంతరం డి.వెంకన్న అధ్యక్షతన జరిగిన సభలో లోకనాథం మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో, ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. గద్దెనెక్కిన మొదలు కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ, పేద ప్రజలపై పన్నులు భారాన్ని మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ, ప్రజలపై భారాలు వేసి ఆదాయాలు రాబట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అమలు చేయకపోతే అప్పులకు అనుమతి ఇచ్చేదిలేదని బెదిరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వం వ్యతిరేకించకుండా మోడీకి భజన చేస్తూ ఆ విధానాలనే అత్యుత్సాహంతో అమలు చేస్తూ ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. ఈ భారాలకు వ్యతిరేకంగానూ, ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, అధిక ధరలను అదుపు చేయాలని, సరసమైన ధరలకు నిత్యావసరాలు అందించాలని, కరెంట్‌ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ సిపిఎం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని తెలిపారు. అందులో భాగంగా జిల్లాలో ఆగస్టు 28 నుండి జరుగు కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, బి.ప్రభావతి పాల్గొన్నారు.