Dec 02,2022 00:06

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జగన్‌ తదితరులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : నిరుద్యోగ సమస్యపై రాష్ట్ర స్థాయి సదస్సును ఈ నెల 3న అల్లూరి సీతారామరాజు విజ్ఞానకేంద్రంలో నిర్వహించనున్నట్లు సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి బి.జగన్‌ తెలిపారు. జగదాంబ సమీపంలోని సిఐటియు కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిఐటియు రాష్ట్ర, జిల్లా మహాసభలు సందర్భంగా నండూరి ప్రసాదరావు స్మారక సెమినార్లు, కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో నిర్వహించే సదస్సుకు ముఖ్య వక్తలుగా ప్రొఫెసర్‌ పురేంద్ర ప్రసాద్‌ (హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ), సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌. నరసింగరావు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్నకుమార్‌, సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌ హాజరవుతారని తెలిపారు. ఈ సదస్సుకు యువకులు, విద్యార్థులు నిరుద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.భారతదేశానికి కీలకంగా వున్న యువతలో నిరుద్యోగం ఎలా ఉంది. దాని పరిష్కారానికి ప్రభుత్వం ఎటువంటి విధానాలు రూపొందించాలో సూచనలు చేయడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 'నిరుద్యోగం- ప్రభుత్వ విధానాలు-కర్తవ్యం'పై సదస్స పోస్టర్‌ను ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.సంతోష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎల్‌జె.నాయుడు, అధ్యక్షులు బి.కుసుమ, కె.రాఘవేంద్ర పాల్గొన్నారు.