Mar 28,2023 20:42

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఖాదీ బోర్డు డిడి వి.హరికృష్ణ

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన
- ఖాదీ బోర్డు డిడి వి.హరికృష్ణ
ప్రజాశక్తి - నంద్యాల రూరల్‌

        ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఖాదీ బోర్డు డిడి వి.హరికృష్ణ పేర్కొన్నారు. మంగళవారం నంద్యాలలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని ఆడిటోరియంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై అవగాహన సదస్సు ఖాదీ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని, గ్రామీణ పరిశ్రమ కమిషన్‌ ఆంధ్రప్రదేశ్‌ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండల వారి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ, జిల్లా పరిశ్రమ కేంద్రం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని పొందడానికి 18 సంవత్సరాలు పైబడి వయస్సు ఉండాలని, కనీసం 8వ తరగతి వరకు చదువు కలిగి ఉంటే చాలన్నారు. అభ్యర్థులు తమ వివరాలు పొందుపరిచిన నిర్ణీత దరఖాస్తుతో పాటు ప్రాజెక్టు రిపోర్టు, విద్యార్హతలు, రేషన్‌ కార్డు, సాంకేతిక విద్యార్హతలు, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు పాస్పోర్ట్‌ సైజు ఫోటోలతో సంబంధిత ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి జిల్లా కార్యాలయంలో అందజేయాలని సూచించారు. చిన్న పరిశ్రమల ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు గరిష్టంగా సుమారు రూ. 50 లక్షలు, సేవారంగంలో రూ.20 లక్షల వరకు 35 శాతం సబ్సిడీపై బ్యాంకుల ద్వారా రుణం ఇవ్వనున్నట్లు చెప్పారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నిరుద్యోగులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రాంతీయ అధికారి చంద్రశేఖర్‌, ఖాదీ బోర్డు జూనియర్‌ ఇన్స్పెక్టర్‌ రాజు, లలితమ్మ, ప్రసాదు, భాస్కర్‌, లబ్ధిదారులు పాల్గొన్నారు.