ప్రజాశక్తి-డుంబ్రిగూడ:మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతంలో ఐటీడీఏ అధికారులు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని నిరుద్యోగ యువత ఎదురుచూపులు చూస్తున్నారు. గతంలో నిర్వహించిన టెండర్ పాట విధానాన్ని రద్దు చేసి, ఈ ఏడాది ఐటిడిఏ విలీనం చేసుకొని సుమారు మూడు నెలలు గడుస్తున్న ఇప్పటికీ ఐటిడిఎ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో స్థానిక యువత ఆందోళనకు గురవుతున్నారు.చాపరాయి జలపాతం నిర్వహణకు కొల్లాపూట్టులో పని చేస్తున్న సిబ్బందిని ఇక్కడకు తీసుకొచ్చి రోజువారీగా పర్యాటకుల ప్రవేశ రుసుములను అధికారులు వసూలు చేయిస్తున్నారు. కానీ ఇక్కడ యువతకు ఇప్పటి వరకు ఎటువంటి అవకాశం కల్పించక పోవడంతో అధికారులు ఎప్పుడు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని నిరుద్యోగ యువత ఎదురు చూపులు చూస్తున్నారు. జలపాతంలో పర్యాటకుల సౌకర్యార్థం కొరకు అభివృద్ధి పనులు చేపట్టేందుకు గాను గతంలో యేడాదికి ఒకసారి టెండర్ పాట విధానంను అమలు చేసి దాని ద్వారా వచ్చే నిధులతో పలు అభివృద్ధి పనులను చేపట్టేవారు. ఈ ఏడాది నుంచి టెండర్ పాట విధానంను రద్దు చేసి ఐటీడీఏలో విలీనం చేసినట్లు అధికారులు చెప్తున్నారు. విలీనం చేసిన తర్వాత స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు ఎటువంటి ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ యువత ఉపాధి కల్పిస్తారా !లేదా !అనే సందేహంలో ఉన్నారు. స్థానిక నిరుద్యోగ యువత డిగ్రీ, పీజీ, బీఈడీ, బీటెక్, అగ్రికల్చర్‌తో పాటు ఇతర ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో ఖాళీగా ఉన్నారు. చాపరాయి జలపాతంలో ఐటిడిఏ ఆధ్వర్యంలో ఉద్యోగాలు భర్తీ చేసి ఉపాధి కల్పిస్తారని వీరంతా ఎదురు చూస్తున్నారు. దీనిపై
అధికారులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వక పోవడంతో నిరుద్యోగ యువత ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడ భర్తీ చేసే ఉద్యోగాల్లో మధ్యవర్తుల దళారీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పత్రిక ప్రకటనలో ప్రకటించి పారదర్శకంగా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ యువత కోరుతున్నారు.










