
ప్రజాశక్తి - వన్‌టౌన్ : రాష్ట్రంలో నిరుద్యోగ యువత సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని, ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సిపిఎం పశ్చిమ సిటీ కార్యదర్శి, 50వ డివిజన్ కార్పొరేటర్ బోయి సత్యబాబు విమర్శించారు. ఈనెల 4వ తేదీ రాజమండ్రి ఆహ్వానం హాలులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్య పరిస్కారానికై ప్రత్యామ్నాయ విధానాతో రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్‌లో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బోయి సత్యబాబు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చాక 5 లక్షల చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. దానివల్ల మరింత నిరుద్యోగం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు కె. సూరిబాబు, పి. రాజు, సీతయ్య, ఎన్, గురప్ప, స్వప్న, లక్ష్మీ, నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం : నిరుద్యోగ యువత సదస్సు రాజమండ్రిలో జరుగుతున్న సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇబ్రహీంపట్నం కామ్రేడ్ వెలగా లక్ష్మణ రావు భవన్‌లో నిర్వహించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం యువతకు తీరని ద్రోహం చేసిందని, యువతకు ఉద్యోగాలు ఎక్కడని సిపిఎం మండల కార్యదర్శి ఎం.మహేష్ ప్రశ్నించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల హామీల్లో భాగంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఉత్తుత్తి హామీలు ఇచ్చి ఉద్యోగాలు లేకపోతే యువతను బజ్జీలు వేసుకోమని చెప్పి యువకుల్ని బిజెపి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ యువత కోసం సిపిఎం ప్రత్యామ్నాయ విధానాలను తీసుకొచ్చేందుకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు అనేక పోరాటాలను నిర్వహిస్తుందని దానిలో భాగంగానే రాజమండ్రిలో ఈనెల 4 తేదీన 10గంటలకు రివర్ బే హాల్‌లో గోదారి గట్టు వద్ద సదస్సు నిర్వహిస్తుందని నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి షేక్ బాషా మండల అధ్యక్షుడు బి.కష్ణరాయలు, సిపిఎం సీనియర్ నాయకులు ఎ.విఠల్ రావు, కొండలరావు, నారాయణ, బాబ్జి శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.