- డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న
ప్రజాశక్తి-విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల నిరుద్యోగులు పలు రూపాల్లో నష్టపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న హెచ్చరించారు. పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల అభ్యర్ధుల వయస్సు ఐదు సంవత్సరాలు పెంచడంతో పాటు ప్రాధమిక పరీక్ష కాల వ్యవధి 90 రోజులకు పెంచాలని కోరుతూ స్థానిక ధర్నా చౌక్‌లో సోమవారం డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రామన్న మాట్లాడుతూ నిరుద్యోగులను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు దగా చేస్తున్నాయని ధ్వజమెత్తారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను ఏళ్ల తరబడి భర్తీ చేయకపోవడంతో, ఉన్నత చదువులు చదువుకున్న యువతీ యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సి వస్తోందన్నారు. 2018 తరువాత 6,511 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్ల తర్వాత 25 వేల ఖాళీ పోస్టులు ఒక్క పోలీసు శాఖలోనే ఉన్నాయన్నారు. జాబ్‌లు లేని జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులను మోసం చేసిన వైసిపి ప్రభుత్వం, ఇప్పుడు మరోమారు నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని విమర్శించారు. కనీసం 15వేల పోస్టులైనా విడుదల చేస్తారని ఆశపడ్డ నిరుద్యోగులకు చివరకు నిరాశే మిగిలిందన్నారు. దీనికి తోడు గత ఐదేళ్లుగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల వయో పరిమితి దాటిపోయిందన్నారు. నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్‌కు 24, ఎస్సై 27 సంవత్సరాల వయోపరిమితి ఇచ్చారని, దీని వల్ల ఇన్ని రోజుల పాటు సన్నద్దమైన మూడు లక్షల మంది అభ్యర్థులు అర్హత కోల్పోయారని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన తప్పిదం వలన నిరుద్యోగులు బలి కావాల్సి వస్తోందని విమర్శించారు. ఫైర్, జైల్ వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్షులు పుప్పాల కష్ణ, సెంట్రల్ సిటీ కార్యదర్శి షేక్ నిజాముద్దీన్, నగర నాయకులు శివ, నోహిత్ కష్ణ, రాము తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-తిరువూరు: తిరువూరు బోసుబొమ్మ సెంటర్‌లో సోమవారం ధర్నా చేసి ఆర్డీవో ప్రసన్నలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు మాట్లాడుతూ వయో పరిమితి, పరీక్ష కాలవ్యవధి తక్కువగా ఉండడంతో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్.సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-నందిగామ: నందిగామ ఆర్డీవో రవీంద్రరావుకు ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నందిగామ మండల కార్యదర్శి జుక్కులూరి రవి, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి గోపి నాయక్, నాయకులు హసేన్, జాన్ సైదా, లెనిన్ పాల్గొన్నారు.










