నిరుద్యోగులు ఇచ్చిన 'చలో తాడేపల్లి' పిలుపును అడ్డుకునేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలయత్నం చేసింది. తీవ్ర నిర్బంధం ప్రయోగించింది. నిరుద్యోగుల ఇళ్లకు, కోచింగ్ తీసుకుంటున్న వారి రూములకు వెళ్లి...కదలవద్దని బెదిరించింది. డి.వై.ఎఫ్.ఐ, ఎస్.ఎఫ్.ఐ నాయకులు, కార్యకర్తలకు ఇల్లు కదలవద్దని నోటీసులు ఇచ్చింది. అక్కడితో ఆగకుండా రెండు రోజుల ముందు నుండే అరెస్టులు చేసింది. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించే వారిని దింపేసి అరెస్టులు చేసింది. ఆఫీసుల మీద దాడి చేసింది. కాకినాడ సుందరయ్య భవనంలోకి అర్ధరాత్రి పోలీసులు గోడ దూకి వచ్చి ఆఫీసంతా సోదా చేశారు. ఇదే విధంగా అన్ని జిల్లాల్లో చేశారు. అయినా కార్యక్రమం ఆపలేకపోయారు.
కొద్ది రోజులు క్రితం విజయనగరం ఆర్.టి.సి కాంప్లెక్స్ దగ్గర దీక్షా కార్యక్రమం విఫలం చేయడానికి విజయనగరం శ్రామిక భవనంలో నిద్రిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను రాత్రి అరెస్టు చేశారు. పోలీసుల నుండి తప్పించుకోడానికి ప్రయత్నం చేసిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ కాలికి దెబ్బ తగిలి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇరవై రోజులుగా మంచంపై వున్నాడు. శాంతియుతంగా ధర్నా చేసినా, ప్రదర్శన చేసినా దీక్ష చేసినా పోలీసులు లాఠీఛార్జి చేస్తున్నారు. ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అడుగడుగునా నిర్బంధం ప్రయోగిస్తున్నారు.
'ఖాళీలున్నా ఉద్యోగం ఇవ్వం' అంటే కడుపు మండదా?
జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన జాబ్ కేలండర్ చూసి యువతలో ఆశలు సన్నగిల్లాయి. ఉద్యోగాలు ఇవ్వం అని ప్రభుత్వం ప్రకటిస్తే లక్షలు ఖర్చు చేసి సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకుంటున్న వారికి కడుపు మండదా? నిరసన తెలియజేయరా? నిరసన తెలియజేయడం నేరం కాదు కదా? మరి నిరసన కార్యక్రమాలు చేసినందుకు విజయనగరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రామ్మోహన్, జిల్లా నాయకుడు హర్ష మీద పోలీసులు 107 కేసు పెట్టడం అణచివేసే కుట్ర కాదా?
మీరూ రాజ్యాంగాన్ని గౌరవించరా?
ఇకముందు ప్రదర్శన, ధర్నా, నిరాహార దీక్షతో సహా ఎటువంటి నిరసన కార్యక్రమాలలో పాల్గనకూడదని విజయనగరం తహశీల్దార్ హుకుమ్ జారీ చేశారు. కాదని ఏ కార్యక్రమంలోనైనా పాల్గంటే రూ.50 వేలు జరిమానా కట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాపితంగా అన్ని జిల్లాల్లో ఇదే వైఖరితో నిరుద్యోగ యువతపై అరెస్టులు, కేసులు, నిర్బంధంతో పోలీసులు విరుచుకుపడుతున్నారు. మోడీ గారితో మైత్రి కారణంగా సి.ఎం కూడా ఆయన దారిలో నడుస్తున్నారా? లేక మీకు కూడా బిజెపి లాగే రాజ్యాంగం మీద గౌరవం లేదా?
అధికార దుర్వినియోగం కాదా?
నిరుద్యోగులను కనీసం ప్రదర్శన చేయనివ్వరు. నిరసన దీక్ష చేయనివ్వరు. ధర్నా చేయనివ్వరు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన పేరుతో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మరైతే ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల్లో, సభల్లో వందలు, వేల మందిని ఏ నిబంధనల ప్రకారం అనుమతిస్తున్నారు? యువకులకు, విద్యార్థులకు, ప్రజలకు వర్తించే నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా? జగన్ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగం కాదా?
ప్రభుత్వానికి ఎందుకంత కంగారు?
జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన మాటల పట్ల నిరుద్యోగ యువత ఎంతో నమ్మకంతో వున్నారు. జగన్ మాట తప్పరని, మడమ తిప్పరనే విశ్వాసంతో ఉన్నారు. జగన్ విడుదల చేసిన జాబులు లేని జాబ్ కేలండర్‌తో నిరాశకు గురయ్యారు. ఆ వెంటనే ఆర్థిక శాఖ 2.35 లక్షల ఖాళీలు వున్నాయని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక బయట పడడంతో నిరుద్యోగులకు కడుపు మండిపోయింది. దానితో విజయనగరం, కర్నూలు జిల్లాల్లో వేలాదిగా నిరుద్యోగులు కదలడంతో ప్రభుత్వంలో కంగారు మొదలైంది. యువత కదలికను అనుమతిస్తే లక్షల మంది రోడ్డుపైకి రావడం ఖాయం. అందుకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గనుక యువత నిరసన తెలియజేయకుండా అడ్డుకునేందుకు అణచివేత మార్గం పట్టింది. అదే నేడు జరుగుతున్న ప్రభుత్వ నిర్బంధానికి మూలం.
బిజెపి లాగే నిరసనను అణచి వేస్తారా?
అధికారంలో వున్న వారు ప్రజల మేలు కోసం పరిపాలన చేయాలని రాజ్యాంగం చెప్పింది. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మేలుకు బదులు కీడు చేస్తే...ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి, నిరసన తెలిపేందుకు హక్కు ఇచ్చింది. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డ్డి ఇద్దరూ 'మాకు ఎదురేమిటి? మాకు వ్యతిరేకంగా నిరసన తెలియచేస్తారా? సహిస్తామా? పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి మిమ్మల్ని జైల్లో పెడతాం, కదలకుండా చేస్తాం' అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇదా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గద్దెనెక్కి చేసే పని.
ఖాళీలు నింపమంటే నిర్బంధమా?
రాష్ట్ర ఆర్థిక శాఖ 2.35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని చెప్పింది. 'ఖాళీలన్నీ నింపండి' అని నిరుద్యోగులు కోరుతున్నారు. ఖాళీలు లేకపోతే ప్రభుత్వం ఆ విషయం ప్రకటించాలి. ఆందోళనకు గురయ్యే యువతకు అదే చెప్పాలి. ఖాళీలు వుంటే ఎప్పుడు నింపుతారో చెప్పాలి. ఇది బాధ్యతాయుత ప్రభుత్వం చేయాల్సిన పని. అది చేయడం మాని ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి నిరసనను కూడా అణచివేయడం రాజ్యాంగ విరుద్ధం. పెత్తందారీ వైఖరి కాదా?
పోలీసులు చెప్పేది మీరే ప్రకటించండి
నిరసన కార్యక్రమాల్లో పాల్గంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయని నిరసన కార్యక్రమాల్లో పాల్గంటున్న నిరుద్యోగ యువతకు పోలీసులు కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఓట్ల కోసం ఉద్యోగాలు ఇస్తుంది. కేసుల్లో పడితే మీకు అవకాశాలు వుండవని బెదిరిస్తున్నారు. అదే నిజమైతే ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తామని జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేయవచ్చు కదా! పోలీసులతో చెప్పించాల్సిన పని ఏమిటి?
ఎల్లకాలం ప్రజలను మోసం చేయలేరు
చంద్రబాబు అధికారంలోకి వచ్చేవరకు 'అందరికీ ఉద్యోగాలు' అన్నారు. అధికారం వచ్చేక మాట మరిచారు. మోడీ రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నారు. అధికారం వచ్చేక పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీలతో రెండు కోట్లు ఉద్యోగాలు ఊడగొట్టారు. ప్రభుత్వ పరిశ్రమలు, రైల్వే, ఎల్.ఐ.సి, బి.ఎస్.ఎన్.ఎల్, గ్యాస్, రక్షణ, ఆయిల్ వంటి సంస్థలను అమ్మేసి, మూసివేసి యువతకు, దేశానికి తీరని ద్రోహం చేస్తున్నారు. చివరికి రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న విశాఖ స్టీలు ప్లాంటునూ లేపేయడానికి బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. దేశానికి, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపి పంచన పవన్ కళ్యాణ్ ఏం ఆశించి చేరారో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం. ఎల్లకాలం ప్రజలను మోసం ఎవరూ చేయలేరు. యువతకు భవిష్యత్ అంధకారం అయినపుడు ఎవరూ ఆపలేరు. ఉద్యమం అణచివేస్తే లావాలా ఎగసి పడతారు. ప్రభుత్వం తట్టుకోలేదు. సమస్యను పరిష్కరించడమే ఉత్తమ మార్గం.

ఎం. కృష్ణమూర్తి
/ వ్యాసకర్త సిపిఐ(యం)
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /










