Sep 30,2023 20:23

నిరసనపై నిర్బంధమా?

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  ప్రభుత్వం దృష్టిలో నిరసన తెలియజేయడం కూడా ఒక నేరంగా పరిణమించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కాదు, కనీసం తమ మనసులో మాటను వివిధ రూపాల్లో బాహ్యా ప్రపంచానికి తెలియపర్చే విధంగా వ్యవహరించడం కూడా ప్రభుత్వం దృష్టిలో శాంతిభద్రతల సమస్యగానో, ట్రాఫిక్‌ సమస్యగానో ప్రభుత్వం, ముఖ్యంగా మన జిల్లా పోలీస్‌ యంత్రాంగం చిత్రీకరిస్తోంది. గడిచిన వారంలో ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, స్కీమ్‌వర్కర్లు, రాజకీయ నాయకులు చేపట్టిన ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, వాటిపై పోలీసులు ప్రయోగించిన నిర్భందాలు, భయోత్పాతం ఇందుకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు తమ వసతి గృహాల్లోనూ, పాఠశాలలు, కాలేజీల్లో సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కనికరించలేదు. దీంతో, కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టిన విద్యార్థులు, వారికి నాయకత్వం వహించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై పోలీసులు దాష్టిక చర్యలకు ఒడిగట్టారు. విద్యార్థుల బట్టలు ఊడదీసిమరీ బలవంతంగా జీపుల్లో ఎక్కించి స్టేషన్‌లో నిర్భందించారు. ఒకరిద్దర్ని తీవ్ర పదజాలంతో దూషిస్తూ చేయిచేసుకున్న సంఘటన కూడా విజయనగరంలో చోటు చేసుకుంది. ఇక ముందు ఇలా ఆందోళనలు చేపడితే క్రిమినల్‌ కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరింపు చర్యలకు కూడా దిగారు. కనీస వేతనాలు అమలు చేయాలని, రిటైర్మెంట్‌ సమయంలో బెనిఫిట్స్‌ చెల్లించాలని, విద్యార్హతను బట్టి ప్రమోషన్లు చెల్లించాలని అంగన్‌వాడీలు, ఆయాలు ఆందోళన చేపట్టడమే నేరమైంది. ఈనెల 26న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టినందుకు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో చాలా మందిని భయబ్రాంతులకు గురిచేశారు. కొంతమందిని అరెస్టుచేశారు. ఇంకొంతమందిని ఇళ్లల్లోనే నిర్భందించారు. కలెక్టరేట్‌కు చేరుకోకుండా అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. తమకు నష్టపరిహారం చెల్లించిన తరువాతే పనులు చేపట్టాలని కోరిన భోగాపురం విమానాశ్రయ నిర్వాసితులపైనా నిర్భందాలకు వెనుకాడలేదు. అప్రోచ్‌రోడ్డు కోసం సేకరించిన 39ఎకరాలకు గాను ఇంకా పరిహారం చెల్లించకపోవడంతో నిన్నగాక మొన్న సంబంధిత రైతులు పనులు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరిపైనా అధికారులు నాన్‌ యూనిఫామ్‌లోవున్న పోలీసులను ఉసిగొల్పి తమ పనికానిచ్చేసుకున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బొబ్బిలి టిడిపి నాయకులు బేబీనాయన సింహాచలం వరకు తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎక్కడికక్కడ టిడిపి నాయకులపై నిర్భందాలు ప్రయోగించారు. తాజాగా జిల్లా కేంద్రంలో ర్యాలీకి తలపెట్టిన టిడిపి నాయకులను జిల్లా వ్యాప్తంగా గృహ నిర్బంధం చేశారు. ఇలా కేవలం రైతులు, విద్యార్థులు, అంగన్‌వాడీలే కాదు. ఉద్యోగులు, కార్మికులు, రాజకీయ నాయకులపైనా ఇదే రకమైన కక్షసాధింపుతో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇక వామపక్షాలు, ముఖ్యంగా సిపిఎం చేస్తున్న ప్రజా ఆందోళనలపై ప్రభుత్వ వైఖరి, పోలీసుల చర్యల గురించి వేరేగా చెప్పనక్కర్లేదు. చివరకు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోరుతూ సిపిఎం చేపట్టిన బైక్‌ యాత్రలోనూ, జిపిఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమంలోనూ పోలీసుల హడావుడి కనిపించింది. దీన్నిబట్టి ప్రజా, కార్మిక, పౌర, రాజకీయ ఉద్యమాలను అణిచివేయడం ద్వారా పాలన చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు, భ్రమలుపడుతున్నట్టు అర్థమౌతోంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టే ప్రజల్లో గూడుగట్టుకున్న అసంతృప్తి, పెల్లుబికుతున్న వ్యతిరేకతను ఆపడం ఎవరి తరమూ కాదన్న విషయం గ్రహించలేకపోతోంది. ఆ మాటకొస్తే అంగన్‌వాడీలను అరెస్టులు, నిర్భందాలు చేసినంతమాత్రానా నిరసన సెగ ఆగలేదు. విద్యార్థుల చేపట్టిన ఆందోళనదీ అదే తీరు. సుమారు 20రోజులుగా టిడిపి నాయకులపై ఉక్కుపాదం మోపుతున్నా ఏదో ఒక రూపంలో నిరసన కార్యక్రమాలు, దీక్షలు జరుగుతునే ఉన్నాయి. అదే సమయంలో ఆయా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్భంద వైఖరి కూడా ప్రజలకు తెలిసిపోతునే ఉంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్భందాలు ప్రయోగించి రాజకీయంగా నష్టపోయి ప్రతిపక్షంలోకి వెళ్లింది. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వమూ అందుకు అతీతమేమీ కాదని పబ్లిక్‌ టాక్‌.